పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల
అగ్రస్థానంలో 96.23 శాతంతో తూగో జిల్లా,
చివరిస్థానంలో 58.31 శాతంతో ఆదిలాబాద్
హైదరాబాద్, మే 15 : పదో తరగతి పరీక్షా ఫలితాలు గురువారం ఉదయం 11:30 గంటలకు విడుదలయ్యాయి. టెన్త్ ఫలితాల్లో 88.62 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాల్లో 96.26 శాతం ఉత్తీర్ణతతో తూర్పుగోదావరి జిల్లా అగ్రస్థానంలో నిలువగా, 58.31 శాతం ఉత్తీర్ణతతో ఆదిలాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. అలాగే రెండో స్థానంలో కడప, మూడో స్థానంలో వరంగల్ నిలిచాయి.
ఈ సారి కూడా బాలిక లదే హవా కొనసాగింది. పదో తరగతి ఫలితాల్లో బాలికలు 89.33 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 87.96 శాతం ఉత్తీర్ణత సాధించారు. 5,784 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించగా, 77 పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైంది. జూన్ 16 నుంచి పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నట్లు అధికారులు తెలిపారు.
10 రోజుల్లో టెన్త్ మార్కుల జాబితా ఆయా పాఠశాలలకు పంపనుట్లు వారు తెలిపారు. రీకౌంటింగ్, రీవాల్యూషన్‌లకు ఈనెల 30 వరకు చివరి తేదీ. గురువారం ఉదయం గవర్నర్ సలహాదారుడు సలావుద్దీన్ అహ్మద్ సచివాలయంలో పదో తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేశారు.