స్టాలిన్ రాజీనామా వార్తలు వదంతులే : కరుణానిధి
చెన్నై, మే 18 : స్టాలిన్ తనకు రాజీనామా లేఖ ఇచ్చారన్న వార్తల్లో నిజం లేదని డీఎంకే అధినేత కరుణానిధి స్పష్టం చేశారు. స్టాలిన్ రాజీనామా వ్యవహారం కలకలం సృష్టించిన నేపథ్యంలో కరుణానిధి ఆదివారం స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్టాలిన్ రాజీనామా ఆలోచనలో ఉన్న మాట వాస్తవమేనని, అయితే ఆయన ఆవశ్యకత పార్టీకి కీలకమన్నారు. తాను పలు సూచనలు చేసిన నేపథ్యంలో స్టాలిన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారని తెలిపారు.
పార్టీలోకీలక బాధ్యతలు వహించాల్సి ఉండగా, స్టాలిన్ రాజీనామా లేఖ ఇస్తే కూడా ఆమోదించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను విశ్లేషించనున్నామని వెల్లడించారు. ఇదిలా వుండగా, పార్టీ ఉప కార్యదర్శి దురైమురుగన్ స్టాలిన్ ఇంటికెళ్లి సుమారు గంటపాటు చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్టాలిన్ రాజీనామా నిర్ణయాన్ని వాపస్ తీసుకున్నట్లు పార్టీ అధ్యక్షుడు కరుణానిధి తనతో అన్నారని తెలిపారు. పార్టీ అధికారంలో లేకున్నా స్టాలిన్ వంటి సమర్థవంతమైన నేత వుండడం వల్లే పార్టీ ఉనికి కోల్పోకుండా రాజకీయాల్లో నిలబడగలుగుతోందని పేర్కొన్నారు. దీనితో స్టాలిన్ రాజీనామా వదంతి టీ కప్పులో తుపానులా చల్లబడింది.