ఇంత నిర్లక్ష్యమా?

high
నీళ్లు వదిలేటప్పుడు హెచ్చరికలుండవా?
సిమ్లా హైకోర్టు ఆగ్రహం
బియాస్‌ ఘటనపై సుమోటోగా కేసు
సిమ్లా, జూన్‌ 10 (జనంసాక్షి) :
హిమాచల్‌ప్రదేశ్‌లో ఇంజినీరింగ్‌ విద్యార్థులు మృతి చెందిన ఘటనపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బియాస్‌ నది ఘటనను సిమ్లా హైకోర్టు మంగళవారం సుమోటోగా కేసు విచారణకు స్వీకరించింది. ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల, ఇంధన శాఖల కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చించింది. ఈ మేరకు ఆయా అధికారులకు నోటీసులు జారీ చేసింది. మరోవైపు, మన్సూద్‌ అహ్మద్‌ అనే అధ్యాపకుడు కూడా బియాస్‌ ప్రమాద ఘటనపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి డ్యాం నుంచి ఒక్కసారిగా నీరు విడుదల చేయడంతో 24 మంది విద్యార్థులు గల్లంతయ్యారని ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే.. లార్జీ ప్రాజెక్టు అధికారులపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దుర్గటన వెనుక అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోందని నీళ్లు వదిలేటప్పుడు లాంటి హెచ్చరికలు జారీ చేయలేదని హైకోర్టు మండిపడింది. ఈ ప్రమాదం ఎలా సంభవించింది, అందుకు కారణాలేంటన్న వివరాలతో ఈ నెల 16వ తేదీలోగా కోర్టుకు నివేదిక ఇవ్వాలని హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది.విజ్ఞానయాత్రకు వెళ్లిన 24 మంది తెలుగు విద్యార్థులు ఆదివారం సాయంత్రం బియాస్‌ నదిలో గల్లంతైన సంగతి తెలిసిందే. లార్జీ డ్యాం దిగువన నది ఒడ్డున విద్యార్థులు ఫొటోలు దిగుతుండగా వరదనీరు ఒక్కసారిగా వారిని ముంచెత్తింది. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండా అధికారులు లార్జీ హైడ్రోపవర్‌ ప్రాజెక్ట్‌ నుంచి నీటిని విడుదల చేయడంతోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన సహాయక బృందాలు ఇప్పటివరకూ కేవలం ఐదు మృతదేహాలను మాత్రమే వెలికితీశాయి. మిగతా వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ప్రమాదానికి కారణమైన వారిని హిమాచల్‌ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. 24 మంది భావి ఇంజినీర్లు గల్లంతైన నేపథ్యంలో హైకోర్టు సుమోటోగా కేసు విచారణ చేపట్టింది.