ఈ గద్దల్ని తరమాల్సిందే!

MAIN 30

ఈ భవంతులు కూలాల్సిందే

ఈ భూములు వక్ఫ్‌బోర్డుకు దక్కాల్సిందే

గురుకుల్‌ ట్రస్ట్‌ నెక్ట్స్‌ ల్యాంకోహిల్స్‌

టీఎస్‌ సర్కార్‌ సహసోపేత నిర్ణయాలు

హైదరాబాద్‌, జూన్‌ 29 (జనంసాక్షి) :

తెలంగాణలోని వక్ఫ్‌బోర్డు భూముల్లో వాలిన గద్దల్ని తరమాల్సిందేనని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ భూముల్లో నిర్మించిన భవంతులను కూల్చాల్సిందేనని సర్కారును కోరుతున్నారు. గురుకుల్‌ ట్రస్ట్‌ భూముల్లో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపిన సర్కారు ల్యాంకోహిల్స్‌ భవంతులను నేలమట్టం చేయాలని ముక్తకంఠంతో కోరుతున్నారు. తెలంగాణ సర్కారు సహసోపేత నిర్ణయాలతో ఇదే ఊపును కొనసాగించాలని ప్రోత్సహిస్తున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ను, తెలంగాణాను చెరబట్టిన వలస పాలకుల అక్రమాలపై తెలంగాణ తొలి ప్రభుత్వం కఠిన చర్యల దిశగా అడుగులు వేస్తోంది. గురుకుల్‌ ట్రస్ట్‌ భూముల్లో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను కూల్చివేసేందుకు గత సోమవారం ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం మంగళవారం రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు పొక్లెయిన్లు, బుల్డోజర్లతో రెండు రోజుల పాటు కూల్చివేతలు కొనసాగించారు. సైబరాబాద్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ నేతృత్వంలో రెండు వేల మంది పోలీసులు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గురుకుల్‌ ట్రస్ట్‌ భూముల్లో ఎకరాల కొద్దీ భూములను అప్పనంగా పొంది భారీ వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకున్న సీమాంధ్ర పెత్తందారులు తమ ఆకాశ హర్మ్యలను ఎలా కాపాడుకోవాలా అని మోడీ వైపు చూస్తున్నారు. అక్రమంగా కొళ్లగొట్టిన భూముల్లో ఇళ్లు కట్టుకున్న వారి పక్షాన టీడీపీ ఎమ్మెల్యే ఒకరు ఆందోళనకు దిగారు. కొద్దిమందితో కలిసి అక్కడ ఏదో చేద్దామని ప్రయత్నించిన సదరు ఎమ్మెల్యేను పోలీసులు ఠాణాకు తరలించి తమ పని కొనసాగించారు. అయితే అయ్యప్ప సొసైటీలో ఫ్లాట్లు కొనుగోలు చేసిన సామాన్యులపైనే తెలంగాణ ప్రభుత్వం బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెట్టిందని, వంద ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న హోటల్‌ నోవాటెల్‌ వైపుగాని, అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ వైపుగాని, బాలకృష్ణ, వైఎస్‌ కుటుంబ సభ్యులు, ఇతర ప్రముఖులకు చెందిన నిర్మాణాల వైపు కన్నెత్తి చూడటం లేదని కొందరు ఆరోపించారు. అయ్యప్ప సొసైటీలో నిర్మాణంలో ఉన్న భవనాల కూల్చివేతలను అడ్డుకునేందుకు కొందరు హైకోర్టును ఆశ్రయించి స్టే కోసం ప్రయత్నించారు. కానీ హైకోర్టు జీహెచ్‌ఎంసీ అధికారుల వాదనతోనే ఏకీభవించింది. అక్రమ నిర్మాణాల కూల్చివేతలు సబబే గో అ హెడ్‌ అంటూ భుజం తట్టింది. ప్రభుత్వం పూర్తిస్థాయి ఆక్రమణలు తొలగించేందుకు అన్ని అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తోంది. నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ ఆక్రమణలు తేల్చి మార్కింగ్‌ కూడా చేసింది. ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ మణికొండలోని వక్ఫ్‌ భూముల్లో నిర్మించిన ఆకాశ హర్మ్యాలు ల్యాంకో హిల్స్‌ పనిబట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది. వక్ఫ్‌ భూములను ఆక్రమించి నిర్మించిన ల్యాంకోహిల్స్‌పై సుప్రీం కోర్టుకు వెళ్తామని ప్రకటించింది. శుక్రవారం మెదక్‌ జిల్లా సంగారెడ్డిలో వక్ఫ్‌ భూములపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఈ విషయం తెలిపారు. వక్ఫ్‌ భూముల్లో 80 శాతం అన్యాక్రాంతమయ్యాయని, వలస పాలకులు వాటిని ఇష్టారాజ్యంగా ఇతరులకు వ్యాపార అవసరాల కోసం కట్టబెట్టారని తెలిపారు. నోరు లేని ముస్లింల పక్షాన తమలాంటి ఉద్యమకారులు అప్పట్లో గొంతు విప్పిన అధికారం ఉందనే అహంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆయన తెలిపారు. ల్యాంకోహిల్స్‌పై ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోమని హరీశ్‌రావు తెలిపారు. మణికొండ ప్రస్తుతం ఉన్నతాదాయ వర్గాలు నివసించే ప్రాంతంగా పేరొందడంతో అక్కడి వక్ఫ్‌ భూములపై కన్నేసిన రాజగోపాల్‌ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అండతో ఆ భూములను అప్పనంగా కొట్టేశాడు. వాటిలో 20 అంతకంటే ఎక్కువ అంతస్తుల భారీ ఫ్లాట్ల నిర్మాణం మొదలు పెట్టాడు. నిర్మాణ దశలోనే భారీగా ఫ్లాట్లను విక్రయించేశాడు కూడా. అయితే ల్యాంకోహిల్స్‌ నిర్మాణం చేపట్టిన స్థలంలో అత్యధిక భూభాగం వక్ఫ్‌బోర్డుకు చెందినదిగా ముస్లిం మతపెద్దలు అభ్యంతరం వ్యక్తం చేశారు. భూ కేటాయింపులు రద్దు చేయాలని ఆందోళనలు కూడా చేశారు. కానీ ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో రాజగోపాల్‌ ఇష్టారాజ్యంగా నిర్మాణాలు కానిచ్చేశాడు. అయితే ఈ భూ కేటాయింపులను నిరసిస్తూ తెలంగాణవాదులు కోర్టుకు వెళ్లగా ల్యాంకో హిల్స్‌ యాజమాన్యం, వక్ఫ్‌బోర్డు ఈ వ్యవహారాన్ని సెటిల్‌ చేసుకోవాలని సూచించింది. వక్ఫ్‌ బోర్డుకు జ్యుడిషియరీ అధికారులున్నా పాలనపగ్గాలు సీమాంధ్రుల చేతిలో ఉండటంతో ఆ భూముల స్వాధీనానికి ప్రయత్నించినా అది అమలుకు నోచుకోలేదు. వక్ఫ్‌బోర్డు, దేవుడి ఇనాం, మన్యం భూములను విక్రయించే, బదలాయించే అధికారం లేకున్నా వలస పాలకులు నిబంధనలేవి పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా భూ సంతర్పణలు చేశారు. హైదరాబాద్‌ నగర శివారుల్లో భారీగా వక్ఫ్‌బోర్డుకు ఆస్తులు ఉన్నా వాటిలో ఇప్పుడు మనకు కనిపించేది బహు స్వల్పమే. ఆయా భూముల్లో సర్వే నిర్వహిస్తే అసలు నిజాలు బయట పడతాయి. సీమాంధ్ర కార్పొరేట్‌ పెద్దలు ముస్లింలను కడు బీదలుగా మిగిల్చి కోట్లకు పడగలెత్తారు. తమది కాని భూమిలో ఆకాశ హర్మ్యాలు నిర్మించి భారీగా దండుకుంటున్నారు. దీనిపై తెలంగాణ సర్కార్‌ ఎంత త్వరగా సుప్రీం కోర్టు గడప తొక్కుతుందా అని ప్రజలు, ముఖ్యంగా ముస్లింలు ఎదురు చూస్తున్నారు.