కన్నీళ్లుపెట్టిన సానియా మీర్జా
హైదరాబాద్: తనపై బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కలత చెందింది. తన భారతీయతను శంకించడంపై తీవ్ర ఆవేదన చెందుతున్నానని ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో వాపోయింది. ఎన్నిసార్లు తన భారతీయతను నిరూపించుకోవాలని ప్రశ్నించింది. మరే దేశంలోనైనా ఇలా జరగుతుందా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.పెళ్లైన తర్వాత కూడా భారత్‌కోసమే ఆడానని, ఎన్నో పతకాలు సాధించానని తెలిపింది. తాను సిసలైన హైదరాబాదీనని, తనను బయటి వ్యక్తిగా చిత్రీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఖండిస్తున్నానని సానియా స్పష్టం చేశారు. వందేళ్లకు పైగా తమ కుటుంబం హైదరాబాద్‌లోనే ఉంటోందని గుర్తుచేశారు. విమర్శలను పట్టించుకోనని, తెలంగాణ గౌరవాన్ని నిలబెడతానని స్పష్టం చేసింది. తనను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం పట్ల క్రీడాకారులెవరూ అసంతృప్తి లేరని తెలిపింది. తన స్నేహితురాలు, బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ కు న్యాయం జరుగుతుందని పేర్కొంది.
తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా పాకిస్థాన్ కోడలు తప్ప మరెవ్వరూ దొరకలేదా అని బీజేపీ జాతీయ కార్యదర్శి, తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ నాయకుడు డాక్టర్ కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమానికి సానియా చేసిందేమీ లేదని కాంగ్రెస్ ఎంపీ వి. హనుమంతరావు విమర్శించారు.