9మంది ముత్తయిదువలతో యాత్ర ప్రారంభం
యాత్రకు అగ్రభాగాన నిలిచిన మహిళలు
అమరావతి,నవంబర్1 (జనంసాక్షి) : తుళ్లూరు శివాలయం నుంచి రైతుల మహాపాదయాత్ర ప్రారంభం కాగా భారీగా రైతులు హాజరు కావడంతో తుళ్లూరులో వీధులు కిక్కిరిసిపోయాయి. మహా పాదయాత్రను 9
మంది ముత్తైదువలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మహిళలు అగ్రభాగాన నడవడం విశేషం. పాదయాత్రకు వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు సంఫీుభావం ప్రకటించాయి. ఈ సందర్భంగా డాక్టర్ రాయపాటి శైలజ మాట్లాడుతూ ఈ యాత్ర 45 రోజులపాటు, తుళ్లూరు నుంచి తిరుపతి వరకు జరుగుతుందన్నారు. డిసెంబర్ 15న తిరుపతికి చేరుకునేలా ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరు అమరావతే రాజధానిగా ఉండాలని కోరుతున్నారన్నారు. శాంతి భద్రతలకు ఎలాండి భంగం కలగకుండా తమ పాదయాత్ర జరుగుతుందని తెలిపారు. ప్రజల నుంచి వస్తున్న మద్దతును చూసి జగన్ ప్రభుత్వం భయపడుతోందని, అందుకే పాదయాత్రకు అనుమతి నిరాకరించిందన్నారు. ఇది రైతుల ఉద్యమం కాదని, ప్రజా ఉద్యమం అని అన్నారు. రాజధాని అనేది రైతులది కాదని, ఐదు కోట్ల మంది ప్రజలదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండిపట్టుదలకు పోకుండా మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని.. అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలని డాక్టర్ రాయపాటి శైలజ విజ్ఞప్తి చేశారు.
యాత్ర సందర్భంగా పలువురు మాట్లాడుతూ అమరావతి లక్ష్యాన్ని ప్రజలకు తెలియచేస్తామని అన్నారు.
రాజధాని రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు టీడీపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. మహా పాదయాత్రలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొని అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రైతుల పాదయాత్ర విజయవంతం కావాలని మనన్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. రైతుల మహా పాదయాత్రకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. 685 రోజులుగా రైతులు ఉద్యమం చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. రాజధాని నిర్వీర్యంతో రాష్ట్రం అప్పుల్లోకి వెళ్లిందని అన్నారు. అమరావతి సంపదను ఉపయోగించుకుంటే ఎలాంటి అప్పులు తేవాల్సిన అవసరం లేదన్నారు. రూ.2 లక్షల కోట్ల సంపదను బూడిదపాలు చేశారని మండిపడ్డారు. పరాయి రాష్ట్ర ముఖ్యమంత్రులు రాష్టాన్న్రి హేళనగా మాట్లాడు తుంటే బాధేస్తోందన్నారు. రాష్టాన్న్రి అభివృద్ధి చేసుకుని ఉంటే వారి విమర్శలకు తావుండేది కాదని అచ్చెన్న పేర్కొన్నారు.