94,770 ఫిర్యాదులకు 92,302కి పరిష్కారం
ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ స్మితాసబర్వాల్
కరీంనగర్, నవంబర్ 26 (ఎపిఇఎంఎస్): ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 92,302 ఫిర్యాదులు పరిష్కారం చేసినట్లు జిల్లా కలెక్టర్ స్మితాసబర్వాల్ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ప్రజావాణి కార్యక్రమంపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజావాణిలో ఇప్పటివరకు 94,770 విజ్ఞప్తులు రాగా అందులో 92,302 విజ్ఞప్తులు పరిష్కరించినట్లు కలెక్టర్ తెలిపారు. 2468 విజ్ఞప్తులు పెండింగ్‌లో నున్నట్లు ఆమె వెల్లడించారు. 228 విజ్ఞప్తులు 30రోజులకు పైబడి పెండింగ్‌లో ఉన్నట్లు, ఆయా శాఖల అధికారులు ఎట్టి పరిస్థితుల్లోను 30రోజులకు పైబడి పెండింగ్‌లో నుంచరాదని ఆదేశించారు. ప్రజావాణికార్యక్రమంలో ప్రజలు వివిధ సమస్యలపై అందచేసిన విజ్ఞాపనలను అధికారులు శ్రద్ధ వహించి సత్వరం పరిష్కారించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు జె.సి.సుందర్ అబ్నార, డి.ఆర్.డి.ఎ డ్వామా తదితరులు పాల్గొన్నారు.