రైతుల ఇబ్బందులు తొలగించేందుకు భూభారతి

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): రైతుల ఇబ్బందులను తొలగించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం శివారులోని ఎఎస్ఆర్ గార్డెన్ లో తహసిల్దార్ శ్రీనివాసులు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డీఓ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాదా బైనమా పేరుతో ధరణిని ప్రవేశపెట్టి పేద రైతులకు అన్యాయం చేసిందన్నారు. ప్రస్తుతం ఆ చట్టాన్ని తొలగించి, పేద రైతులందరికీ న్యాయం జరిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ భూమిలో మోకాపై ఉన్న పేద రైతులందరికీ పట్టాలు ఇచ్చేలా భూభారతి చట్టాన్ని అమలు చేయడం జరిగిందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

తాజావార్తలు