కులగణన డేటా.. సామాజిక అభివృద్ధి వాటా..
` ఇది తెలంగాణ మెగా హెల్త్ చెకప్ : సీఎం రేవంత్ రెడ్డి
` కులగణనపై ప్రభుత్వానికి 300 పేజీల నివేదిక ఇచ్చిన స్వతంత్ర నిపుణుల కమిటీ
` రాష్ట్రంలోని బలహీనవర్గాల అభ్యున్నతికి ఈ నివేదిక ఉపయోగపడుతుంది
` రాష్ట్రంలో నిర్వహించిన సర్వే చరిత్రాత్మకమైంది రాహుల్ హామీ మేరకు విజయవంతంగా పూర్తిచేశాం
` వెనుకబాటులో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య తేడాలు, వాటికి కారణాలను కూడా అధ్యయనం
చేయాలని కమిటీకి సూచించిన ముఖ్యమంత్రి
హైదరాబాద్(జనంసాక్షి): రాష్ట్రంలో జరిగిన కులగణన కేవలం డేటా సేకరణ కాదని.. ఇది తెలంగాణ మెగా హెల్త్ చెకప్‌గా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభివర్ణించారు. రాష్ట్రంలో బీసీల అభ్యున్నతికి, సామాజిక న్యాయం అమలు చేసేందుకు కులగణన ఉపయోగపడుతుందన్నారు. కులగణనపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఎంసీహెచ్‌ఆర్‌డీలో సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమైంది. 300 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కులాల వారీగా వెనుకబాటుతనాన్ని విశ్లేషించిన కమిటీ.. కొత్త పాలసీలతో పాటు ప్రస్తుత విధానాలను మెరుగుపరిచేందుకు అవసరమైన సూచనలను నివేదికలో పొందుపర్చింది. కమిటీ సూచనలపై కేబినెట్‌లో చర్చించి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోనుంది.వెనుకబాటుతనంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య తేడాలు, వాటికి కారణాలను కూడా అధ్యయనం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో నిర్వహించిన సర్వే చరిత్రాత్మకమైందని.. దేశానికి రోల్ మోడల్‌గా మారుతుందని నిపుణుల కమిటీ అభిప్రాయపడిరది. సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, అధికారులు పాల్గొన్నారు.