నేడు మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప‌ర్యటన

సీఎం రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం త‌న సొంత జిల్లా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో పర్యటించ‌నున్నారు. ప‌ర్యటనలో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులతో కలిసి ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. జిల్లా క‌లెక్టరేట్‌ వ‌ద్ద మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేయ‌నున్నారు. ఎస్ఎన్ గార్డెన్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు.మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి మ‌హబూబ్‌న‌గ‌ర్ జిల్లా కేంద్రానికి ప్రత్యేక హెలికాప్టర్‌లో బ‌య‌ల్దేర‌నున్నారు. మ‌. 12.45 గంట‌ల‌కు మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ చేరుకుంటారు. మ‌. 12.45 నుంచి ఒంటి గంట వ‌ర‌కు క‌లెక్టరేట్‌ వ‌ద్ద మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం అనంత‌రం ఉమ్మడి జిల్లా ప్రముఖులతో రేవంత్ రెడ్డి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు మ‌హిళా శ‌క్తి క్యాంటీన్‌ను ప్రారంభించ‌నున్నారు. వివిధ అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేయ‌నున్నారు.మ‌ధ్యాహ్నం 1.15 నుంచి సాయంత్రం 4.45 గంట‌ల వ‌ర‌కు క‌లెక్టరేట్‌లో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో అభివృద్ధిపై స‌మీక్షా నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంట‌ల నుంచి 5.45 వ‌ర‌కు భూత్పూర్ రోడ్డులోని ఏఎస్ఎన్ క‌న్వెన్షన్‌ హాల్‌లో పార్టీ నాయ‌కులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులతో స‌మావేశం కానున్నారు. సాయంత్రం 6 గంట‌ల‌కు మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుంచి తిరిగి హైద‌రాబాద్‌కు బ‌య‌ల్దేరుతారు.