రెండు దశాబ్దాల తర్వాత ఓయూకు సీఎం
21న ఉస్మానియా వర్సిటీకి రానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తొలిసారిగా సీఎం రానుండడంతో సిబ్బంది, విద్యార్థుల్లో నూతనోత్సాహం
సర్కారు, యూనివర్సిటీ మధ్య సహకారం మరింత బలోపేతం
మౌలిక వసతులకు మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం
హాస్టల్ ప్రారంభోత్సవం, కొత్త నిర్మాణాలకు శంకుస్థాపన
ఘనంగా ఏర్పాట్లు చేస్తున్న యూవర్సిటీ యాజమాన్యం
హైదరాబాద్, ఆగస్ట్ 17 (జనంసాక్షి) :
తెలంగాణలో ఉద్యమాలకు ఊపిరి పోసిన ఉస్మానియా యూనివర్సిటీకి తొలిసారిగా ఓ ముఖ్యమంత్రి వెళ్లనున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారిగా సీఎం రానుండటం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తుండగా.. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యా నాణ్యత, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇదొక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని అధికారుల్లో ఆశాభావం వ్యక్తమవుతోంది. రెండు దశాబ్దాల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానుండటంతో రాష్ట్ర ప్రభుత్వం, యూనివర్సిటీ మధ్య సహకారం మరింత బలపడుతుందని భావిస్తున్నారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఓయూకు వచ్చి ప్రసంగించనున్న రేవంత్ రెడ్డి చారిత్రాత్మక సందర్భానికి వేదిక కానుండటం విశేషం.
ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి కాశీం ఆదివారం రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఆగస్ట్ 21న ఓయూ లో జరిగే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రావాలని ఆహ్వానం పలికారు. ఓయూలో 80 కోట్ల వ్యయంతో నిర్మాణమై 1200 మంది విద్యార్థులకు వసతి కల్పించే రెండు హాస్టల్స్‌ను ప్రారంభించి, గిరిజన సంక్షేమం శాఖ ఆర్థిక సహాయంతో మరో 300 మంది విద్యార్థులకు వసతి కల్పించే రెండు కొత్త హాస్టల్స్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం సీఎం చేతులమీదుగా జరుగనున్నది. ఇప్పటికే ఓయూలో ఉన్న 25 హాస్టళ్లలో 7223 మంది విద్యార్థులకు వసతి ఉండగా సీఎం చేతుల మీదుగా ప్రారంభించే హాస్టల్స్ అదనపు వసతిని సమకూర్చనున్నాయి. ఇదే కార్యక్రమంలో దాదాపు 10 కోట్ల నిధులతో డిజిటల్ లైబ్రరీ రీడిరగ్ రూం పనులకు కూడా సీఎం ప్రారంభించనున్నారు. అదే రోజు ఓయూలో ఉన్న టాగూర్ ఆడిటోరియంలో వెయ్యి మంది ప్రొఫెసర్లను, విద్యార్థులను ఉద్దేశించి ‘‘తెలంగాణ విద్యా రంగంలో రావాల్సిన మార్పులు ప్రభుత్వ ప్రణాళిక’’ అనే విషయం మీద సీఎం ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొంటారు. ఇరవై ఏళ్ల కాలంలో ఓయూలోకి ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ప్రసంగించనున్న తొలి సీఎం రేవంత్ రెడ్డి అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ‘‘సీఎం రీసెర్చ్ ఫెలో షిప్’’తో పాటు విదేశీ పర్యటనకు వెళ్లే విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించే పథకాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నామని వీసీ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరై, హాస్టల్స్ ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాలను జరిపించడం ద్వారా విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే విధంగా ఉంటుందని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కొత్త హాస్టల్స్ గిరిజన విద్యార్థులకు మరింత మెరుగైన వసతి సౌకర్యాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉస్మానియా యూనివర్సిటీకి మరింత గుర్తింపును తెచ్చిపెడుతుందని హర్షం వ్యక్తం చేశారు.