ఆధ్యాత్మికతను పెంపొందించుకోవాలి

 

 

 

 

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భక్తులు ఆధ్యాత్మికతను పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ధర్మ ప్రచారంలో భాగంగా భూపాలపల్లి పట్టణంలోని సుభాష్ కాలనీలో శనివారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కన్నుల పండువగా నిర్వహించారు.
భూపాలపల్లిలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో మొట్టమొదటి సారిగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ సనాతన ధర్మపరిరక్షణకు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ధర్మ ప్రచారం ద్వారా సమాజంలో నైతిక విలువలు, శాంతి, ఐక్యత పెంపొందుతాయని అన్నారు. దివ్య కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, మహిళలు, యువత, భక్తులు పాల్గొన్నారు.