తెలంగాణ ఉద్యమంలో దిగంబర్ సేవలు చిరస్మరణీయం

బోధన్ జేఏసీ కన్వీనర్ గోపాల్ రెడ్డి
బోధన్, జనవరి 8 ( జనంసాక్షి ) : ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మాతృశ్రీ సిరిగిరి దిగంబర్ సేవలు చిరస్మరణీయమని బోధన్ జేఏసీ కన్వీనర్ గోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో దీక్షాస్థల్ వద్ద బోధన్ టీజేఏసీ ఆధ్వర్యంలో టీజేఏసీ కోశాధికారి సిరిగిరి దిగంబర్ సార్ సంతాప సభను నిర్వహించారు. బోధన్ లో మాతృశ్రీ విద్యాసంస్థల కరస్పాండెంట్ సిరిగిరి దిగంబరావ్ ఒక ఉన్నతమైనటువంటి కుటుంబం నుండి వచ్చి ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి ఏదైతే తాను సమాజం నుండి అభ్యసించినటువంటి దాన్ని తిరిగి తిరిగి సమాజానికి అందించాలనేటటువంటి గొప్ప ఆశయంతో బోధన్ పట్టణంలో ప్రైవేట్ విద్యాసంస్థలను ఏర్పాటు చేసి ఎంతోమంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దారని కొనియాడారు. సంతాప సభలో టీజేఏసీ కన్వీనర్ పి గోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మల్లేష్, బోధన్ జేఏసీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకై జరిగిన మలిదశ ఉద్యమంలో బోధన్ పట్టణంలో జరిగిన 1519 రోజులు దీక్షలో ఆ సందర్భంగా జరిగిన అనేక కార్యక్రమాలకు సిరిగిరి దిగంబరావ్ సారు చేసిన సేవలు మరువలేనివన్నారు. ఉద్యమంలో జరిగిన అనేక వివాదాలను ఎంతో నేర్పుతో ఓపికతో చర్చించి పరిష్కారాలు చేశారని తెలిపారు. జేఏసీకి కార్యక్రమాలకు ఎటువంటి కష్టాలు ఇబ్బందులు వచ్చిన వాటికి అండగా నిలబడ్డారన్నారు. వీటితోపాటు తన విద్యాసంస్థలలో పిల్లలకు విద్య నేర్పే విషయంలో అనేక సహాయ సహకారాలు అందించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర లక్ష్య సాధనలో ఆయన చేసిన సహాయ సహకారాలు మరువలేనివని వాటి సాధన కోసం మనం ముందుకు సాగడమే దిగంబరావ్ సార్ కు నిజమైన నివాళులని అన్నారు. ఈ కార్యక్రమంలో దిగంబర్ సతీమణి జయశ్రీ, బోధన్ టీ జేఏసీ ప్రధాన కార్యదర్శి బి. మల్లేష్, జి. శివరాజ్, సాయిబాబా గౌడ్, ఆర్టీసీ సుదర్శన్, నక్క లింగారెడ్డి, ఎం. విద్యాసాగర్, లక్ష్మణ్ పటేల్, నర్సింగప్ప, మాతృశ్రీ స్కూల్ ఇన్చార్జి హెచ్.సుభాష్, ప్రైవేట్ విద్యాసంస్థల నాయకులు కొడాలి కిషోర్, ముత్యాల హరికృష్ణ, శ్రీనివాస్ రావ్, ఐఆర్ చక్రవర్తి సిబ్బంది, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



