అధైర్య పడొద్దు ఆదుకుంటాం : ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
పరకాల, (జనంసాక్షి): అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. బుధవారం పరకాల మండలం లక్ష్మీపురం గ్రామంలో దెబ్బతిన్న మొక్కజొన్న పంట, అలాగే పరకాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు తడిసిన వరి ధాన్యాన్ని అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు.అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని, గ్రామాల్లో అకాల వర్షాలకు నష్టపోయిన పంటలను ఎప్పటికప్పుడు నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలన్నారు. నష్టపోయిన రైతులు అధైర్య పడవద్దని, నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు.అలాగే నడికూడ మండలం నరసక్కపల్లి గ్రామంలో గ్రామంలో ఉడుత లక్ష్మీ రాజయ్య ఇళ్ళు గాలి దుమారానికి ఇంటి పై కప్పు లేచిపోగా వారిని పరకాల ఎమ్మెల్యే పరామర్శించి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, పరకాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కట్కూరి దేవేందర్ రెడ్డి, అధికారులు, రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.