పైపు లీకేజీతో త్రాగునీటి వృథా

 

 

 

 

 

 

 

 

మంగపేట జనవరి03(జనంసాక్షి)

ఎవరు పట్టించుకోవడం లేదంటూ సోషల్ మీడియాలో వీడియోలు హల్చల్

మంగపేట మండలం కమలాపురం గ్రామంలోని టీడీపీ కాలనీలో గత కొన్ని నెలలుగా మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ కారణంగా ప్రతిరోజూ కొన్ని వందల లీటర్ల శుద్ధి నీరు వృథాగా పోతున్నది గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. లీకేజ్ పైపు ద్వారా లీక్ అయిన త్రాగునీరు నేరుగా డ్రైనేజీలోకి చేరుతుండటంతో గ్రామస్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ సమస్యపై సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ కనీసం పట్టించుకోకపోవడం దారుణమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తపరిచారు. ఇలా ఫిర్యాదులు చేసిన కూడా కనీసం మరమ్మతులు చేపట్టకపోవడం పట్ల గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నెలల తరబడి త్రాగు నీరు వృథాగా పోతున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు అనేక ప్రాంతాల్లో త్రాగునీటి కొరత ఎదురవుతున్న సమయంలో, శుద్ధి చేసిన నీరు ఇలా వృథాపాలు కావడంపై ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ, తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పైపు లీకేజీని వెంటనే మరమ్మతులు చేసి నీటి వృథాను అరికట్టాలని త్రాగునీటి సరఫరా శాఖ, పంచాయతీ అధికారులను గ్రామస్తులు కోరుతూ సోషల్ మీడియాలో సైతం వీడియోలను పోస్ట్ చేస్తూ వారి ఆవేదనను వ్యక్తపరిచారు.