డ్రగ్స్‌, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి

 

 

 

 

 

రాయికల్ జనవరి 8(జనం సాక్షి):

జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్

డ్రగ్స్‌, మాదకద్రవ్యాల మహమ్మారిని సమాజం నుండి పూర్తిగా నిర్మూలించి భావితరాలకు ఆరోగ్యకరమైన, సురక్షితమైన భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ తెలిపారు. బుధవారం రాయికల్ మండల కేంద్రంలో గల ఆర్‌ఆర్ గార్డెన్స్ లో జిల్లా పోలీస్ శాఖ మరియు రాయికల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్రగ్స్‌ వ్యతిరేక అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… డ్రగ్స్‌, మాదకద్రవ్యాలకు బానిసలవడం వల్ల యువత భవిష్యత్తు పూర్తిగా నాశనం అవుతుందని హెచ్చరించారు. విద్యార్థులు తమ లక్ష్యాలపై దృష్టి సారించి, మంచి చదువుతో పాటు క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. డ్రగ్స్‌ వినియోగం వల్ల శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలతో పాటు కుటుంబాలు విచ్ఛిన్నం కావడం,నేరాలకు పాల్పడే పరిస్థితులు ఏర్పడతాయని తెలిపారు. డ్రగ్స్‌ సరఫరా, వినియోగంపై జిల్లా పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, రాబోయే రోజుల్లో మాదకద్రవ్యాల నిర్మూలనలో కీలక పాత్ర పోషించేది నేటి తరం విద్యార్థులేనని పేర్కొన్నారు.విద్యార్థుల దృష్టి పూర్తిగా తమ విద్య, కెరీర్‌పై ఉండాలని, నిషేధిత డ్రగ్స్‌ మరియు ఇతర మత్తు పదార్థాల వైపు ఆకర్షితులు కాకూడదని సూచించారు. అధిక ఒత్తిడిని ఎదుర్కొనేందుకు మత్తు పదార్థాలను ఆశ్రయించకుండా, సానుకూల మార్గాలను ఎంచుకోవాలని తెలిపారు. స్నేహితుల ఒత్తిడితో చెడు మార్గాల వైపు అడుగులు వేయరాదని హెచ్చరించారు. మాదకద్రవ్యాల బారిన పడుతున్న యువతను కాపాడేందుకు జిల్లా పోలీస్ శాఖ కృషి చేస్తోందని, అందులో భాగంగా విద్యాసంస్థలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహించడం జరుగుతోందని అన్నారు. మత్తు పదార్థాల నివారణ కోసం యువత, విద్యార్థులు యాంటీ డ్రగ్స్ కమిటీలలో సభ్యులుగా చేరి “యాంటీ డ్రగ్స్ సోల్జర్” లుగా సహకరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలుసుకున్న విషయాలను స్నేహితులు, బంధువులకు తెలియజేసి డ్రగ్స్ నివారణలో తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. అదేవిధంగా ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ,వారు ఎలాంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
విద్యార్థులు ఎవరైనా డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం గమనించిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచడం జరుగుతుందని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. డ్రగ్స్‌ లేని సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని, విద్యార్థులే సమాజానికి మార్గదర్శకులని పేర్కొన్నారు. అనంతరం మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులను ప్రశ్నలు అడిగి అవగాహన పెంపొందించారు.ఈ సందర్భంగా విద్యార్థులతో“మేము డ్రగ్స్ తీసుకోము. మా బంధుమిత్రులు, స్నేహితులు, చుట్టుపక్కల వారు మాదకద్రవ్యాలకు అలవాటు పడకుండా చూసుకునే బాధ్యత మాదే, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాల గురించి వారికి అవగాహన కల్పిస్తాము”అని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి ఐపీఎస్, డీఎస్పీ రఘు చందర్, రూరల్ ఇన్స్పెక్టర్ సుధాకర్, ఎస్‌ఐలు సుధీర్ రావు, గీత, కృష్ణ, ఎంఈఓ రాఘవల్, ఎంఆర్‌ఓ నాగార్జున, జేఏసీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వాసరి రవి, ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్, కోశాధికారి మచ్చ శేఖర్,పాత్రికేయులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ-విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.