యూరియా పంపిణీలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి

 

 

 

 

 

 

చెన్నారావుపేట, జనవరి 2 (జనం సాక్షి): 

వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద..

యూరియా పంపిణీలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం చెన్నారావుపేట మండలంలోని లింగగిరి గ్రామంలో యూరియా పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా యూరియా నిల్వలు, టోకెన్ల పంపిణీ విధానం, రైతులకు యూరియా పంపిణీ జరుగుతున్న తీరును కలెక్టర్ నేరుగా పరిశీలించారు. అనంతరం అక్కడున్న రైతులతో స్వయంగా మాట్లాడారు.
యూరియా పంపిణీ ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులు సౌకర్యంగా యూరియా పొందేందుకు ఎక్కువ సంఖ్యలో కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి రైతు తన పంట విస్తీర్ణం ఆధారంగా మాత్రమే ఎకరానికి ఒక్క బ్యాగ్ యూరియా తీసుకోవాలని తెలిపారు.అలాగే చెన్నారావుపేట మండలం లింగగిరి గ్రామంలో 444 బస్తాలు, జల్లి గ్రామంలో 444 బస్తాలు, అక్కల్ చెడ గ్రామంలో 444 బస్తాల యూరియా పంపిణీ చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు.
గోడౌన్‌లో ప్రస్తుతం 5,500 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లాలోని రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, అర్హులైన ప్రతి రైతుకు యూరియా అందేలా పంపిణీ కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా సహకార అధికారి నీరజ, చెన్నారావుపేట తహసిల్దార్ మహమ్మద్ ఆబిద్ అలీ, ఎంపీడీవో వెంకట శివానంద్, వ్యవసాయ అధికారి గోపాల్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.