హస్తినలో కొనసాగుతున్న ఉద్రిక్తత
నిషేధాజ్ఞలమధ్యే నిరసనలు
బాధితురాలి పరిస్థితి విషమం
న్యూఢిల్లీ, డిసెంబర్ 23 (జనంసాక్షి) :
ఇండియాగేట్ వద్ద ఉద్రిక్తత రెండో రోజూ ఆదివారం కొనసాగింది. మూడు రోజులు గా ఇండియాగేట్ ప్రాంతంలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో నిరసన ఉద్రిక్తంగా మారిం ది. పోలీసులు ముందు జాగ్రత్తగా 144వ సెక్షన్ విధించారు. పోలీసులు ఆందోళన కారులను అడ్డుకుని ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. విద్యార్థులను అదుపు చేసేం దుకు పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు దళాలు, కేంద్ర బలగాలు చేసిన యత్నాలు విఫలమయ్యాయి. వారిపై వాటర్‌కేనాన్లు, బాష్పవాయు గోళాలుప్రయోగించారు. నిందితులను ఉరితీయాలని ఆందోళనకారులు డిమాండు చేశారు. మహిళా రక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయాలని నినాదాలు చేశారు. నిందితులపై విచారణ వేగవంతం చేసి శిక్షించాలని కోరారు. బాధితురాలికి మెరుగైన చికిత్స అందించాలని డిమాండు చేశారు. విద్యార్థులు ఆందోళనకు పోటెత్తడం మరింత మంది చేరుకోకుండా నగరంలోని ఏడు మెట్రో రైల్వే స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. ఢిల్లీలో ఎటు చూసినా పది కిలోమీటర్ల మేర రాకపోకలు నిలిచి పోయాయి. ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనాల రాకపోకలు స్తంభించాయి. రాష్ట్రపతి భవన్ వైపు వెళ్లే అన్ని మార్గాలను పోలీసులు మూసివేశారు. అలాగే ఇండియాగేట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ జనపథ్, విజయ్‌చౌక్, ఇండియా గేట్ వద్ద నిరసన కొనసాగించారు. విద్యార్థుల ఆందోళనకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంఘీభావం తెలిపారు. సామాజిక కార్యకర్త అన్నాహుజారే కూడా మద్దతు ప్రకటించారు. అంతేగాక ప్రస్తుతం ఉన్న చట్టాలను మరింత కఠినంగా మార్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల నిరసనను పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని సూచించారు. కాగా సఫ్దర్ జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిరాలి ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు వైద్యులు హెల్త్ బులెటిన్‌లో ప్రకటించారు. ఆమెకు మళ్లీ వెంటిలేటర్ అమర్చినట్లు వారు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం వరకు బాధితురాలు కోలుకుంటున్నట్లు ప్రకటించిన వైద్యులు మళ్లీ పరిస్థితి విషమించినట్లు చెప్పడంతో విద్యార్థుల ఆందోళన ఉధృత రూపం దాల్చింది. సంఘటనకు బాధ్యులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.