గుండెపోటుతో జర్నలిస్ట్ మృతి

బెల్లంపల్లి, (జనంసాక్షి): బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల మన తెలంగాణ విలేకరి రేణుకుంట్ల వెంకటేశ్వర్లు శుక్రవారం గుండెపోటుతో మరణించాడు. శుక్రవారం తెల్లవారు ఝామున ఛాతిలో నొప్పిగా ఉందని బెల్లంపల్లి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి రిసెప్షనిస్ట్ వద్ద పేరు నమోదు చేసే క్రమంలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కూలబడి పోయాడు. డాక్టర్ వచ్చి పరీక్షించగా లాభం లేకుండా పోయింది. జర్నలిస్ట్ వెంకటేశ్వర్లు మృతికి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సంతాపం ప్రకటించి, సానుభూతి వ్యక్తం చేశారు. బెల్లంపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కారుకూరి రాంచందర్, బెల్లంపల్లి నాయకుడు దావ రమేష్, నెన్నెల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గట్టు మల్లేష్, నాయకులు గురునాదం మల్లాగౌడ్, కంపెల రమేష్, వెంకటేశ్వర్లు భౌతికయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. గత పదిహేనేళ్ళు గా మండలంలోని సమస్యలను ప్రభుత్వం, అధికారుల ద్రుష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో ఎంతో కృషి చేశారు. నెన్నెల మండల కేంద్రానికి ఆర్టీసీ బస్సు రావడంలో ఆయన కృషి ఎంతగానో ఉంది. కేవలం వెంకటేశ్వర్లు పోరాటం వల్లే ఆర్టీసీ అధికారులు నెన్నెల మండల కేంద్రానికి బస్సు సౌకర్యం కల్పించారు. మండల ప్రజలు జర్నలిస్ట్ వెంకటేశ్వర్లు సేవలను గుర్తు చేసుకుంటూ శోక సంద్రంలో మునిగిపోయారు. వెంకటేశ్వర్లు అకాల మరణం వల్ల నెన్నెల మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

తాజావార్తలు