జస్టిస్ ‘సుదర్శన’ చక్రం.. దేశానికి సముచితం
ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్‌తో దేశవ్యాప్తంగా చర్చ
సుదర్శన్‌రెడ్డి అభ్యర్థిత్వంపై పలుసర్వేల్లో అనేక సానుకూలతలు
ఈ ఎన్నిక ఓట్ చోరీ వర్సెస్ రాజ్యాంగ పరిరక్షణ
లౌకిక భారతదేశం, సాంప్రదాయిక భావజాలం మధ్య పోరాటం
ఇదొక ఆదర్శప్రాయమైన యుద్ధం..
అరవైశాతంపైగా మద్దతు పలికిన ప్రజల గొంతుకగా ‘బీఎస్‌ఆర్’
ప్రత్యర్థులను విమర్శించబోనని ప్రకటించిన మొదటివ్యక్తి
ప్రజల హక్కులు, రాజ్యాంగ, ప్రజాస్వామ్య పరిరక్షణగా ఆయనొక అస్త్రం
స్వేచ్ఛ, సమానత్వంపై సంపూర్ణ అవగాహన కలిగిన నిపుణుడు
ఇండియా కూటమి నిర్ణయాన్ని స్వాగతిస్తున్న విద్యావంతులు, మేధావులు
జనంసాక్షి ప్రత్యేక ప్రతినిధి (తెలంగాణ)
నిష్పక్షపాతం, జవాబుదారీతనం, హక్కులు, విలువలు పతనమవుతున్న సంధి దశలో ‘ఇండియా’ కూటమికి దొరికిన ఓ అస్త్రం.. యావత్ భారతావణిని మళ్లీ ఒక్కటి చేస్తుందనే ఆశలు చిగురిస్తున్నాయి. మహనీయులు కలలుగన్న మహోన్నత ఆశయాలను ముందుకు నడిపించే సాధకుడిగా కోట్లాది హృదయాలు ఆశాభావంతో ఉప్పొంగుతున్నాయి. మతోన్మాదుల చేతుల్లో మసకబారుతున్న రాజ్యాంగపు వ్యవస్థలకు ఆయనే సస్యరక్షకుడిగా.. సరైన యోధుడిగా భావిస్తున్నాయి. అణగారినవర్గాలకు ‘సమన్యాయం’ అందించేలా అవిరళ కృషిచేసిన న్యాయకోవిదుడి చేతుల్లోనే రాజ్యాంగ పరిరక్షణ మళ్లీ సాధ్యమవుతుందని, కోట్లాది గొంతుకగా ఈ ‘సుదర్శన’ చక్రం స్వేచ్ఛా, సమానత్వానికి మళ్లీ బాటలు వేస్తుందని ఆశిస్తున్నాయి. పార్టీలతో ప్రమేయం లేని ఆయన అరవైశాతంపైగా మద్దతు తెలిపిన దేశప్రజల తరపున ప్రాతినిధ్యం వహించేందుకు నడుం బిగించడం చరిత్రలో ఓ కీలక ఘట్టం..! ఆయన అభ్యర్థిత్వాన్ని మేధావులు, విద్యావంతులు, యువత సైతం స్వాగతిస్తుండటం దేశానికి సముచితం..!!
అణగారినవర్గాల సాధికారత, స్వేచ్ఛ, సమానత్వం కోసం పాటుపడ్డ మహనీయుల్లో ఒకరు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి. పుట్టింది అగ్రకులంలో అయినా పనిచేసింది మాత్రం బడుగుబలహీనవర్గాల సంక్షేమానికే..! యాభై ఏండ్లకుపైగా ‘న్యాయం’ కోసం ప్రజల తరపున నిలబడిన నిఖార్సైన భారతీయుడు. రాజకీయాలకు అతీతంగా దేశ సమగ్రతకు ప్రతినిత్యం పరితపించిన ప్రజల ‘న్యాయ’మూర్తి.. ప్రస్తుతం ఉపరాష్ట్రపతికి నామినేషన్ వేయడం దేశవ్యాప్త చర్చకు దారితీసింది. కూటమిగా ఉన్న విపక్ష పార్టీలన్నీ ఆయన అభ్యర్థిత్వాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాయంటేనే 60శాతానికిపైగా ప్రజలందరి మద్దతు లభించినట్టు. ఈ స్ఫూర్తితో దేశానికి మరోసారి ప్రజలందరికీ సమన్యాయం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు సుదర్శన్ రెడ్డి ప్రకటించడం పట్ల ఇండియా కూటమిలో సమరోత్సాహం నెలకొంది. దేశాన్ని కుదిపేస్తున్న ఓట్ చోరీ ఉదంతం ఒకవైపు.. ఉప రాష్ట్రపతి ఎన్నిక మరోవైపు.. వెరసి రాజ్యాంగ వ్యవస్థలను కాపాడే అత్యున్నత పదవి ఉపరాష్ట్రపతిగా న్యాయకోవిదుడైన బి సుదర్శన్ రెడ్డి సమర్థుడని దేశంలోని మేధావులు, విద్యావంతులు భావిస్తున్నారు. విదేశాల్లో మాదిరిగా తమకే గనుక ఓటువేసే హక్కు ఉంటే ఈ ఎన్నికలో ‘జస్టిస్’ను ఎన్నుకునేవారిమని సర్వత్రా అభిప్రాయపడుతున్నారు.
ఎవరినీ విమర్శించని ఏకైక వ్యక్తి
60శాతానికిపైగా ఓటర్ల మద్దతు పొందిన ఇండియా కూటమి తమ అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేయడం పట్ల దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. ఇండియా కూటమి సైద్ధాంతిక సమరంగా ఉప రాష్ట్రపతి ఎన్నికను భావిస్తున్నప్పటికీ.. ‘బీఎస్‌ఆర్’ మాత్రం తనదైన శైలిలో అన్నిపార్టీల మద్దతు కోరుతున్నారు. రాజ్యాంగంతో సుదీర్ఘమైన ప్రస్థానం ఉన్న ఆయన.. ఐదు దశాబ్దాలకుపైగా సామాజిక సమన్యాయం కోసం కృషిచేశారు. ఈ ఎన్నిక సందర్భంగానూ ఆయన ప్రజాస్వామ్య అత్యున్నత సాంప్రదాయాలను కాపాడే బాధ్యతను భుజానికెత్తుంటానని, అన్నిపార్టీలు మద్దతునివ్వాలని సవినయంగా విన్నవించుకోవడం దేశం పట్ల సుదర్శన్‌రెడ్డి అంకితభావాన్ని తెలియజేస్తోంది. రాజకీయాలతో, పార్టీలతో ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేకపోయినా దేశ పురోగతిలో భాగస్వామ్యమయ్యారు. ఇప్పుడు కూడా ప్రత్యర్థులను ఎవరినీ విమర్శించబోనని ప్రకటించిన అసలు సిసలైన ఏకైక నాయకుడిగా నిలిచారు. రాజ్యాంగ వ్యవస్థల పట్ల అవగాహన ఉన్నవారినే ఎన్నుకోవాలని ఎంపీలకు విన్నవిస్తున్నారు.
నాడూ.. నేడు.. న్యాయనిర్ణేతే..
సుదర్శన్ రెడ్డి బలహీనవర్గాల గొంతుక అని చెప్పడంలో సందేహం లేదు. మానవహక్కుల పరిరక్షణకు పెద్దపీట వేసిన ఆయన.. దేశంలోని ఎన్నో కీలక తీర్పులను వెలువరించారు. రిటైర్మెంట్ అయినప్పటికీ దేశ, రాష్ట్ర పురోగతికి నిత్యం ప్రణాళికబద్ధంగా పనిచేశారు. రాష్ట్రంలో కులగణన తర్వాత ఏర్పాటుచేసిన స్వతంత్ర నిపుణుల కమిటీకి చైర్మన్‌గా ఉన్నారు. ఆయన సూచనల మేరకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కులగణన సర్వేలో ఆయన నేతృత్వంలోని స్వతంత్ర నిపుణుల బృందం పనితీరు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడం విశేషం. అందుకే రాజ్యాంగపు విలువలు పరిరక్షించాలన్నా.. ప్రజాస్వామ్యం అపహాస్యం కాకుండా ఉండాలన్నా సుదర్శన్‌రెడ్డిని ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోవాలనే ఆకాంక్ష ప్రగాఢంగా వినిపిస్తోంది.
ఇది రాజకీయపరమైన పదవి కాదు : జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి
ఉప రాష్ట్రపతి పదవి రాజకీయాలకు అతీతమైనది. గౌరవప్రదమైన రాజ్యాంగ పదవి. దేశంలోని సగానికిపైగా ఓటర్లు మద్దతు తెలిపిన ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేయడం గౌరవంగా భావిస్తున్నా. ఉత్తరం, దక్షిణం అనే తేడా లేనేలేదు. పార్టీల మధ్య పోరు కానేకాదు. భారత రాజకీయ వ్యవస్థలో మార్పు ఆశిస్తున్నాను కాబట్టే అన్నిపార్టీల ఎంపీల మద్దతు కోరుతున్నా. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వరిస్తే దేశానికి ప్రయోజనం. రాజ్యసభను నిష్పక్షపాతంగా నడపడం కోసం ఎంపీలు సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా.