అధికారులపై అనిశా పంజా

ఉమ్మడి ఆదిలాబాద్‌లో వేర్వేరుచోట్ల దాడులు
పట్టుబడ్డ నలుగురు అధికారులు
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కడెం నాయబ్‌ తహసీల్దార్‌
మంచిర్యాల : ఉత్తర తెలంగాణ చలితో వణికిపోతుంటే… ఈ రోజు మాత్రం ఏసీబీ వరుస దాడులతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అట్టుడికిపోయింది. బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. లంచం తీసుకుంటుండగా వారికి కాసిపేట పంచాయతీ రాజ్‌ ఏఈ పరంజ్యోతి చిక్కారు. ఏఈ పాత పనికి బిల్లు కోసం లంచం డిమాండ్‌ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో ఏఈ పెర్కపల్లి పంచాయతీ సెక్రెటరీ వీరబాబు ద్వారా రూ. 15 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు. దీంతో ఏఈ పరం జ్యోతి, పెర్కపల్లి పంచాయతీ కార్యదర్శి వీర బాబును అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.ఇక నిర్మల్‌ జిల్లాలో కడెంలో సైతం ఏసీబీ దాడులు నిర్వహించారు. కడెం తహసీల్దార్‌ కార్యలయంలో తహసీల్దార్‌ రాజేశ్వరితో పాటు డీటీ ని సైతం అరెస్టు చేశారు. భూమి రిజిస్ట్రేషన్‌ కోసం డబ్బులు డిమాండ్‌ చేయడంతో ఇక్కడ కూడా బాధితులు ఏసీబీని ఆశ్రయించడంతో బుధవారం డీటీ ద్వారా డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తహసీల్దార్‌ రాజేశ్వరి, డీటీ చిన్నయ్యను అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు.