డబ్బు మద్యం రహిత ఎన్నికలు నిర్వహించుకుందాం

నీతి నిజాయితీ నిబద్ధత గల నాయకునికి పట్టం కడుదాం
అవినీతి రహిత పాలకవర్గాన్ని ఎన్నుకుందాం
జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగల్ల పరమేశ్వర్
చేర్యాల(జనంసాక్షి) జనవరి 29 : ప్రజాస్వామ్య వ్యవస్థలో మరీ ముఖ్యంగా రాజకీయ పార్టీల ఎన్నికల ప్రక్రియలో ప్రజలే రాజులు రారాజులు అని జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ అన్నారు. గురువారం చేర్యాల జేఏసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు ఢిల్లీ, హైదరాబాద్ స్థాయి ఎన్నికలు కావని ఇవి కేవలం గల్లీ స్థాయి ఎన్నికలు మాత్రమే కాబట్టి ప్రజా సమస్యలపై అవగాహన ఈ ప్రాంత అవసరాల కోసం నిరంతరం ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం పనిచేసే నాయకులకే పట్టం కట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాని అన్నారు. రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు ద్వారా డబ్బు, మద్యానికి ప్రభావితులై ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మంచి నాయకున్ని ఎన్నుకోవాలని అన్నారు. డబ్బు మద్యానికి లోనై ఓటు వేస్తే ఐదు సంవత్సరాల పాటు ప్రజలు ఓడిపోయినట్లే అవుద్దని అన్నారు. ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి కొమ్మూరి ప్రతాపరెడ్డి, ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి లకు “క్యారెక్టర్, కండక్టు, కేపాబ్లిటీ, పబ్లిక్ తో కనెక్ట్విటీ” కలిగిన అభ్యర్థులకే ప్రాధాన్యత ఇచ్చి టికెట్ కేటాయించి ప్రజల్లోకి పంపాలని విజ్ఞప్తి చేశారు. పోటీ చేసే అభ్యర్థులు ఇష్టారాజ్యంతోటి డబ్బులు వెదజల్లి ప్రజలను ప్రలోభపెట్టి ఎన్నికల్లో గెలిచినట్లయితే డబ్బు లేకుండా ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి నైతిక విజయమని పట్టణ ప్రజలు, జేఏసీ భావిస్తుందని పేర్కొన్నారు. లేనిపోని ఆర్భాటాల్లోకి వెళ్లి అప్పుల పాలై జీవితాలలో కుటుంబాలను చితికిపోయేటట్లు చేసుకోవద్దని పోటీ చేసే అభ్యర్థులను కోరారు. ఎన్నికల్లో ఆర్థికపరమైనటువంటి తప్పిదాలు జరగకుండా ఎన్నికల నిర్వహణ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో నియోజకవర్గ జేఏసీ నాయకులు అందె అశోక్, బుట్టి సత్యనారాయణ, గడిపే బాల నర్సయ్య, పోలోజు వెంకటాద్రి, ఈరి భూమయ్య, జంగిలి యాదగిరి, చందా శ్రీకాంత్, వలబోజు నర్సింహా చారి, నంగి కనకయ్య, గోమారపు నర్సయ్య,సిద్దిరాం భద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.



