రాష్ట్రాన్ని హరితవనం చేద్దాం

18కోట్ల మొక్కలు నాటుదాం..
` ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది
` వచ్చే ఎన్నికల్లో మహిళలకు 60 అసెంబ్లీ సీట్లు
` ఆత్మగౌరవంతో ఆడబిడ్డలు నిలబడేలా కృషి..
` కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం
` వనమహోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
రంగారెడ్డిజిల్లా ప్రతినిథి (జనంసాక్షి): వనమే మనం మనమే వనం అని పెద్దలు చెప్పారని ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి అన్నారు.సోమవారం రాజేంద్రనగర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని యూనివర్సిటీ ప్రాంగణంలో రుద్రాక్ష మొక్కను నాటి వనమహోత్సవం 2025 ను ప్రారంభించారు. యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ ను సందర్శించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వనమే మనం, మనమే వనం అని పెద్దలు చెప్పారని,ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుందని అన్నారు. ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 18 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, లక్ష్యాన్ని పూర్తి చేయుటకు ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, అందరు ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములై ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. అమ్మ పేరుతో ఒక మొక్కను నాటాలని దేశ ప్రధాని పిలుపునిచ్చారని, ప్రధాని పిలుపును సాదరంగా ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో రెండు మొక్కలు నాటలని పిలుపునిచ్చారు. అమ్మలు కూడా పిల్లల పేరుతో మొక్కను నాటాలని, ప్రతీ ఇంట్లో కనీసం రెండు మొక్కలు నాటాలని, మీ పిల్లల్లాగే నాటిన మొక్కలను సంరక్షిస్తే తెలంగాణ రాష్ట్రమంతా పచ్చదనంతో నిండిపోతుందని అన్నారు మహిళలను ప్రోత్సహిస్తూ మా ప్రభుత్వం ముందుకు వెళుతోందని, సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతను ఆడబిడ్డలకు అప్పగించామని, ఆర్టీసీలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడమే కాకుండ, ఆర్టీసీకి వెయ్యి బస్సులను అద్దెకు ఇచ్చేలా ప్రోత్సహించి వారిని బస్సులకు యజమానులను చేశామని తెలిపారు హైటెక్‌ సిటీలో విప్రో, మైక్రోసాఫ్ట్‌ సంస్థలు ఉండేచోట మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువులను మార్కెటింగ్‌ చేసుకునే సదుపాయం కల్పించామని అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, పట్టణ ప్రాంతాల్లో మహిళలు కూడాను మహిళా సంఘాల్లో చేరేలా కృషి చేయాలన్నారు. ఈ ఏడాది మహిళా సంఘాలకు రూ.21 వేల కోట్లు రుణాలు అందించామని తెలిపారు. అన్ని రంగాల్లో ఆడబిడ్డలను ముందు భాగాన నిలపాలని ప్రయత్నిస్తున్నామని, ఇందిరమ్మ రాజ్యంలో ఆడ బిడ్డలు ఆత్మగౌరవంతో నిలబడేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహిళా రిజర్వేషన్‌ రాబోతోందని, వచ్చే ఎన్నికల్లో మహిళలకు 60 ఎమెల్యే సీట్లు ఇచ్చేబాధ్యత నేను తీసుకుంటానాని ముఖ్యమంత్రి తెలిపారు. అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ వృక్షో రక్షిత రక్షితః చెట్లను పెంచడం ద్వారా మనల్ని మనం రక్షించుకోవడం జరుగుతుందని, జీవవైవిధ్యన్ని కాపాడుకోగలుగుతామని అన్నారు. చెట్లను పెంచడం ద్వారా వర్షాలు సకాలంలో కూరుస్తాయని, వంద శాతం మొక్కలు నాటేందుకు కృషి చేయాలని, భౌగోళిక పరిస్థితి మెరుగుపడే విధంగా రాష్ట్రమంతా విరివిగా వనాలు పెంచాలని, అందుకు అందరూ భాగస్వాములు కావాలని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ శాఖ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ చీఫ్‌ విఫ్‌ పట్నం మహేందర్‌ రెడ్డి, సీఎం సలహాదారు వేంనరేందర్‌ రెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు ప్రకాష్‌ గౌడ్‌, కాలే యాదయ్య, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌ శ్రీలత శోభన్‌, కమిషనర్‌ కర్ణన్‌, జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిమా సింగ్‌, ఉన్నతాధికారులు. తదితరులు పాల్గొన్నారు…

1.జాతీయ,అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు అవకాశమివ్వండి
` ఖేలో ఇండియా గేమ్స్‌ తెలంగాణలో నిర్వహించండి
` క్రీడాభివృద్దికి రూ.100 కోట్లు కేటాయించండి
` ఒలింపిక్స్‌లో రెండు గేమ్స్‌ తెలంగాణలో నిర్వహించండి..
` క్రీడాకారులకు రైలు ప్రయాణ ఛార్జీల్లో రాయితీ పునరుద్ధరించండి
` కేంద్ర మంత్రి మాండవీయకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వినతి
ఢల్లీి(జనంసాక్షి): ఖేలో ఇండియా గేమ్స్‌-2026ను తెలంగాణలో నిర్వహించాలని కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్‌సుఖ్‌ ఎల్‌. మాండవీయకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఖేలో ఇండియాతో పాటు జాతీయ క్రీడలు, జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని పరిశీలించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ ఎల్‌.మాండవీయను ఢల్లీిలోని ఆయన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి సోమవారం కలిశారు. ఖేలో ఇండియా కింద క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి, క్రీడాకారుల శిక్షణ, క్రీడా నిపుణులఎంపిక ఇతర కార్యక్రమాలకు నిధులు కేటాయించాలని కోరారు. భువనగిరిలో సింథటిక్‌ అథ్లెటిక్‌ ట్రాక్‌, మల్టీపర్పస్‌ ఇండోర్‌ స్టేడియం, రాయగిరిలో స్విమ్మింగ్‌ పూల్‌, మహబూబ్‌నగర్‌లోని పాలమూరు యూనివర్సిటీలో సింథటిక్‌ అథ్లెటిక్‌ ట్రాక్‌, కరీంనగర్‌ శాతవాహన యూనివర్సిటీలో మల్టీపర్పస్‌ హాల్‌, హైదరాబాద్‌ హకీంపేట్‌ లో అర్చరీ రేంజ్‌, సింథటిక్‌ హాకీ ఫీల్డ్‌, ఎల్‌.బి.స్టేడియంలో స్క్వాష్‌ కోర్టు, నేచురల్‌ ఫుట్‌బాల్‌ ఫీల్డ్‌ అభివృద్ది, సింథటిక్‌ ట్రాక్‌, గచ్చిబౌలిలో హాకీ గ్రౌండ్‌ నవీకరణ, నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో సింథటిక్‌ అథ్లెటిక్‌ ట్రాక్‌ నిర్మాణాలకు రూ.100 కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రి మాండవీయను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే క్రీడా వసతుల మెరుగుకు అన్నివిధాలా కృషి చేస్తోందని… కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన సహకారం ఇవ్వాలని సీఎం కోరారు. 2036లో దేశంలో నిర్వహించే ఒలింపిక్స్‌లో కనీసం రెండు ఇవెంట్లు తెలంగాణలో నిర్వహించాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు గతంలో మాదిరే రైలు ప్రయాణాల్లో ఛార్జీ రాయితీ ఇవ్వాలని సీఎం కోరారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (క్రీడలు) ఏ.పి.జితేందర్‌ రెడ్డి, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్‌ రెడ్డి, కేంద్ర పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాల సమన్వయ కార్యదర్శి డాక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ పాల్గొన్నారు.

తెలంగాణలో అంతర్జాతీయస్థాయి ఫిల్మ్‌ స్టూడియో
` ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో ప్రముఖ సినీ నటుడు అజయ్‌ దేవగణ్‌
` యానిమేషన్‌, వీఎఫ్‌ఎక్స్‌ స్టూడియోల ఏర్పాటుకు సంసిద్ధత
ఢల్లీి(జనంసాక్షి): తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఫిల్మ్‌ స్టూడియో ఏర్పాటుకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డికి ప్రముఖ సినీ నటుడు అజయ్‌ దేవగణ్‌ విజ్ఞప్తి చేశారు. ఢల్లీిలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ఆయన అధికారిక నివాసంలో అజయ్‌ దేవగణ్‌ సోమవారం కలిశారు. ఈ సందర్భంగా సినీ నిర్మాణంలో కీలకమైన యానిమేషన్‌, వీఎఫ్‌ఎక్స్‌ స్టూడియో, ఏఐ, ఇతర సదుపాయాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్టూడియో నిర్మాణాన్ని తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని అజయ్‌ దేవగణ్‌ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ స్థాయి స్టూడియో నిర్మాణంతో పాటు సినీ పరిశ్రమలో వివిధ విభాగాలకు అవసరమైన నిపుణులను అందుబాటులోకి తెచ్చేందుకు నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు అజయ్‌ దేవగణ్‌ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్దికి తాము తీసుకుంటున్న చర్యలను, వివిధ రంగాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను సీఎం రేవంత్‌ రెడ్డి అజయ్‌ దేవగణ్‌కు వివరించారు. తెలంగాణ రైజింగ్‌కు సంబంధించి మీడియా, సినిమా రంగాలకు ప్రచారకర్తగా ఉంటానని అజయ్‌ దేవగణ్‌ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి తెలియజేశారు. సమావేశంలో ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్‌ రెడ్డి, కేంద్ర పథకాల సమన్వయ కార్యదర్శి డాక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ పాల్గొన్నారు.

తెలంగాణలో క్రీడా రంగం అభివృద్ధి అద్భుతం
` ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో భేటీలో మాజీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ ప్రశంస

హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం క్రీడా రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ ప్రశంసించారు. ఢల్లీిలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డిని ఆయన అధికారిక నివాసంలో కపిల్‌ దేవ్‌ సోమవారం కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు, క్రీడాభివృద్ధికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం రేవంత్‌ రెడ్డి కపిల్‌ దేవ్‌ కు వివరించారు. యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీతో పాటు తెలంగాణలో క్రీడాభివృద్ధికి సంబంధించిన అన్ని విషయాల్లో తాను భాగస్వామినవుతానని కపిల్‌ దేవ్‌ ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఈ సందర్భంగా దక్షిణ కొరియాతో పాటు పలు దేశాల్లో తాము సందర్శించిన క్రీడా యూనివర్సిటీలు.. అక్కడి క్రీడా ప్రముఖులతో తమ భేటీల వివరాలను సీఎం రేవంత్‌ రెడ్డి కపిల్‌ దేవ్‌కు తెలిపారు. సమావేశంలో ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్‌ రెడ్డి, కేంద్ర పథకాల సమన్వయ కార్యదర్శి డాక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ పాల్గొన్నారు.