దేశంలో మోడీ పాలన ఆదర్శనీయం
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):దేశంలో నరేంద్ర మోడీ పాలన ఆదర్శనీయంగా కొనసాగుతుందని, గత 11 ఏళ్లుగా భారత్ ప్రగతి పథంలో దూసుకెళ్తుందని, రానున్న రోజుల్లో తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చి బిజెపి డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేస్తామని బిజెపి మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి, జిల్లా ఇంచార్జి అల్జాపూర్ శ్రీనివాస్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూరునగర్ లో గల బిజెపి జిల్లా కార్యాలయంలో శుక్రవారం బిజెపి జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిశీధర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అల్జాపూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ పాలన 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఆయా జిల్లాల్లో బిజెపి ప్రత్యేక సమావేశాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు రావడం జరిగిందన్నారు. ముఖ్యంగా నరేంద్ర మోడీ సారధ్యంలో దేశంలో బిజెపి మెరుగైన పాలనను అందిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నప్పటికీ, అవగాహన లేక కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో అమలు చేయడం లేదని చెప్పారు. బిజెపి లోని అన్ని కమిటీల సభ్యులు క్షేత్రస్థాయిలో మోడీ పథకాలను ప్రజలకు వివరించాలని ఆయన కోరారు. అనంతరం బిజెపి రామగుండం నియోజకవర్గ ఇన్చార్జి కందుల సంధ్యారాణి మాట్లాడుతూ దేశంలో 11 సంవత్సరాల పాటు బిజెపి అన్ని వర్గాల ప్రజలకు మంచి పాలన అందించడం జరిగిందన్నారు. ముఖ్యంగా నిరుద్యోగులకు, యువకులకు, రైతులకు, మహిళలకు, అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యమైన పథకాలను దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టి ప్రధాని నరేంద్ర మోడీ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. మౌలిక సదుపాయాలు, అభివృద్ధి మార్గాలను అన్వేషిస్తూ, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తూ భారత్ ముందంజలో ఉండేలా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. దేశ సరిహద్దు విషయంలో సింధూర్ లాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారని తెలియజేశారు. ఇలాంటి మంచి కార్యక్రమాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కూడా అవకాశవాద పార్టీలని, ప్రజలు వారిని నమ్మే పరిస్థితిలో లేరని, రానున్న రోజుల్లో బిజెపి డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేయడం ఖాయమని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర నాయకులు, క్రమశిక్షణ సంఘం కన్వీనర్ నాగపూరి రాజమౌళి గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపయ్య, జిల్లా వికసిత్ భారత్ కన్వీనర్ జన్నె మొగిలి, పార్లమెంట్ కో కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు, వికసిత్ భారత్ కో కన్వీనర్ దొంగల రాజేందర్, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు బట్టు రవి, పార్టీ ముఖ్య నాయకులు పొలుసాని తిరుపతిరావు, వేషాల సత్యవతి, సయ్యద్ గాలిఫ్, పులుగుజ్జు రాజు, కలివేద మోహన్, ఊరటి మునీందర్, ఎర్ర రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.