వంకమామిడి అభివృద్ధే నా లక్ష్యం

భూదాన్ పోచంపల్లి, డిసెంబర్ 8 (జనం సాక్షి):

కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మచ్చ శ్రీనివాస్

వంకమామిడి గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడం, ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపడం తన ప్రధాన ధ్యేయమని కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న మచ్చ శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం గ్రామంలో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో ప్రతి ఇంటిని సందర్శించి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా కత్తెర గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. గ్రామ అభివృద్ధికి తాగునీరు, రహదారులు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల మెరుగుదల అత్యవసరమని, వాటిని ప్రాధాన్యతగా తీసుకుని పనులు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. వంకమామిడిని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దడం తన లక్ష్యమని స్పష్టం చేశారు. అంతేగాక వంకమామిడి నుంచి శేరిళ్ల వరకు తార రోడ్డు నిర్మాణాన్ని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గ్రామ ప్రజలు విస్తృత స్థాయిలో మద్దతు ప్రకటిస్తున్నారని, ఈ ఎన్నికల్లో మచ్చ శ్రీనివాస్ సర్పంచ్ గా ఘన విజయం సాధించడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు.