అణగారిన వర్గాల కోసం ఆలోచన చేసిన పూలే
మంథని, (జనంసాక్షి) : అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆనాడు జీవితాలు, ప్రాణాలు త్యాగం చేసిన మహనీయుల చరిత్రను తెలుసుకోకపోతే చరిత్ర సృష్టించలేమనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. సామాజిక సాంఘీక విప్లవకారుడు జ్యోతీరావు పూలే జయంతి సందర్బంగా మంథని పట్టణంలో పూలే విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం మహనీయుల దీక్షను స్థానిక నాయకులతో కలిసి స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మహానీయుల చరిత్రను ఇంకా తెలుసుకోవడంతో పాటు సమాజానికి కూడా తెలియజేసేలా మహానీయుల స్ఫూర్తి దీక్షను తీసుకున్నానన్నారు. మహానీయుల స్ఫూర్తి దీక్షను ఈ నెల 14న అంబేద్కర్ జయంతి వరకు కొనసాగిస్తామని, ఈ దీక్ష సందర్భంగా ప్రత్యేక డ్రెస్ కోడ్‌లోనే ఉంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. గత ఏడాది 15 మందితో ప్రారంభమైన దీక్ష ఈసారి రెట్టింపు స్థాయిలో దీక్షాపరులు దీక్ష చేపట్టారని, వచ్చే ఏడాదికి మరింతగా పెరుగుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో అక్షర జ్ఞానానికి దూరంగా ఉంచబడిన బీసీ, ఎస్పీ, ఎస్టీ, మైనార్టీ సమాజానికి విద్యాదానం చేసిన గొప్ప వ్యక్తి మహాత్మా పూలే అని వివరించారు. తన తుది శ్వాస విడిచే వరకు అణగారిన వర్గాల కోసమే ఆలోచన చేశాడని, చివరకు తనకు పిల్లలు వద్దని, దేశంలోని పిల్లలందరూ తన పిల్లలని బావించి తన బార్య సావిత్రీబాయికి పిల్లలు పుట్టకుండా పసరు మందు తాగించిన గొప్ప మహనీయుడని కొనియాడారు. అట్టడుగు వర్గాల కోసం పూలే తన కుటుంబాన్ని త్యాగం చేస్తే డాక్టర్ బీఆర్. అంబేద్కర్ తన కుమారుడు చనిపోయాడని తెలిసినా సమాజం కోసం వాదించాడని, అలాంటి మహనీయుల త్యాగాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, చాకలి ఐలమ్మ, కోమురం బీం, జగ్జీవన్‌రాం లాంటి మహనీయుల చరిత్రను తెలుసుకుని చర్చించుకోకపోతే ఇంకా బానిసత్వంలోనే మన బతుకులు ఉంటాయని, బహుజన బిడ్డలకు ఎలాంటి అవకాశాలు రావని ఆయన అన్నారు. మంథని నియోజకవర్గంలో ఇంకా పందులు కూడా ఉండలేని గుడిసెల్లో పేదలు ఉంటున్నారంటే అందుకు కారణం ఇక్కడి పాలకులేనని, తనలాంటి వారు బంగ్లాల్లో ఉన్నా ఇంకా 99శాతం పేదలు పూరిగుడిసెల్లోనే ఉండటానికి వారే కారణమని ఆయన అన్నారు. మహనీయులను మనం అర్థం చేసుకోకపోవడం, పాలకుల పరిపాలనను తెలుసుకోకపోవడం మూలంగానే అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ఆనాడు తెలంగాణ కోసం కేసీఆర్ పోరాటం మొదలు పెట్టి రాష్ట్రాన్ని ఎలా సాధించుకున్నారో అదే తరహాలో నియోజకవర్గంలో చరిత్రను సృష్టించే చరిత్రకారులు తయారు కావాలన్నారు. ఈనాడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన అంటూ మహనీయుల మాసంలో పోలీస్‌యాక్ట్‌ను అమలు చేస్తోందన్నారు. మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాల్సి ఉండగా ఉత్సవాలను జరుపుకోకుండా అణిచివేసేలా ప్రయత్నాలు చేస్తోందన్నారు. మహనీయుల మాసంలో ఉత్సవాలు జరుపుకోకుండా పోలీస్ యాక్ట్ పెట్టడం ప్రజాస్వామ్యానికే చీకటి అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి పరిస్థితులు ఉండేవో అవే పరిస్థితులు మళ్లీ వచ్చాయని, ఆంక్షలతో పరిపాలన చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా పోరాటం చేస్తుంటే తమ గొంతునొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గురించి తెలియకుండా పాలన చేస్తున్నారని, రాష్ట్రంలో దోపిడి పాలన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సంవిదాన్ బచావ్ అంటూ తిరుగుతున్న రాహుల్ గాంధీ మంథనిలో జరుగుతున్న తీరుపై స్పందించాలని, ఇక్కడ సంవిదాన్ ద్వంసం అయిందనే విషయాన్ని గ్రహించాలన్నారు. ప్రజల ఆకలి తీర్చడం కోసం అంబేద్కర్ అందించిన ఓటు విలువ తెలిపేందుకు తుదిశ్యాస వరకు తన పోరాటం కొనసాగుతుందన్నారు. మహనీయుల దీక్ష స్వీకరించిన దీక్షాపరులు గ్రామగ్రామాన వెళ్లి మహనీయుల ఆశయాలు, ఆలోచన విధానాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని, డ్రెస్ కోడ్‌తో గడపగడపకు వెళ్లి మహనీయుల చరిత్రను చాటి చెప్పాలని ఆయన ఈ సందర్బంగా పిలుపునిచ్చారు.