సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి
బెల్లంపల్లి, (జనంసాక్షి): బెల్లంపల్లి పట్టణంలోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి, రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామి, బొల్లం పూర్ణిమ మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు సింగరేణి పాత క్వార్టర్సులలో నివసిస్తున్న వారి నుంచి డబ్బులు కట్టించుకుని జీవో నెంబర్ 76 ప్రకారం కొందరికే పట్టాలు ఇచ్చినారని అన్నారు. మిగతా వారు డబ్బులు చెల్లించిన ఇంకా చాలా మందికి పట్టాలు రాలేదన్నారు. చాలామంది పాత సింగరేణి క్వార్టర్స్లలో నివసిస్తున్నారని, వారికి కూడా నామమాత్రపు రుసుము తీసుకొని అందరికీ జీవో నెంబర్ 58, 59 ప్రకారంగా పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారంగా అర్హులందరికీ రేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలన్నారు. ప్రభుత్వము రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్న సందర్భంగా అందరికీ రేషన్ కార్డు అందించి సన్నబియ్యం పంపిణీ చేస్తే వారి కుటుంబాలకు లబ్ధి చేకూరి, వారి కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయన్నారు. బెల్లంపల్లి పట్టణంలో పారిశుద్ధ్యము లోపించిందని, అన్ని బస్తీలలో చెత్త రోడ్లపై పేరుకుపోతున్నదన్నారు. వెంటనే స్పందించి చర్యలు తీసుకొని పారిశుద్ధ్య పట్టణంగా తీర్చిదిద్దాలని అన్నారు. బెల్లంపల్లి పట్టణానికి డంపు యార్డు అనేది సమస్యగా తయారైందని, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆమోదయోగ్యమైన స్థలాన్ని గుర్తించి డంపు యార్డు ఏర్పాటు చేయాలన్నారు. పట్టణంలోని అన్ని బస్తీలలో నీటి ఎద్దడి ఉన్నదని, మిషన్ భగీరథ ద్వారా నీటిని రెండు వారాలకోసారి, వారానికోసారి నీటి సరఫరా చేస్తున్నారన్నారు. దీనివల్ల ప్రజలకు నీటి గురించి అవస్థలు పడుతున్నారని, నీటిని రెండు రోజులకు ఒకసారి సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నాయని, అట్టి ప్రభుత్వ భూములను అధికారులు శ్రద్ధ చూపి కబ్జాకు గురికాకుండా కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేకల రాజేశం, పట్టణ సహాయ కార్యదర్శి కొంకుల రాజేష్, పట్టణ సమితి సభ్యుడు అంబాల ప్రభుదాసు పాల్గొన్నారు.