సర్కారు బడుల దశ,దిశ మారుస్తాం

` రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాం
` త్వరలోనే విద్యాకమిషన్‌
` ఏకోపాధ్యాయ పాఠశాలను మూసివేయం
` రూ.2 వేల కోట్లతో ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ
` మెగా డీఎస్సీతో టీచర్ల నియామక ప్రక్రియ
` ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాటను ప్రోత్సహించాలి
` ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చినవారే
` ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రతిభాపురస్కారాల ప్రధానోత్సవంలో సీఎం రేవంత్‌
` టెన్త్‌లో పది గ్రేడ్‌ సాధించిన విద్యార్థులకు సన్మానం
హైదరాబాద్‌(జనంసాక్షి): ప్రతీ గ్రామం, ప్రతీ తండాకు విద్యను అందించేలా తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని ఉద్ఘాటించారు. శిథిలావస్థకు చేరిన అన్ని ప్రభుత్వ పాఠశాలల భవనాలను పునర్నిర్మించేందుకు రూ.2వేల కోట్లతో పనులు ప్రారంభించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడిరచారు. విద్యార్థులను బడిలో చేర్పించేందుకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమాన్ని తమ ప్రభుత్వం నిర్వహిస్తోందని ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగించామని తెలిపారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు రావట్లేదని సింగిల్‌ టీచర్‌ ఉన్న పాఠశాలలను మూసివేయొద్దని సంబంధిత అధికారులను ఆదేశించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో సర్కార్‌ పాఠశాలలను సరిగా పట్టించుకోలేదని.. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వం మౌలిక వసతులపై దృష్టి కేంద్రీకరించకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. సోమవారం రవీంద్రభారతిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వానికి భేషజాలు లేవు.. ఎవరైనా సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తే బాగుండేదన్నారు. వందేమాతరం ఫౌండేషన్‌ ఇలాంటి మంచి కార్యక్రమం ద్వారా తమ బాధ్యతను గుర్తు చేసిందని తెలిపారు. ప్రైవేట్‌ పాఠశాలలతో పోటీ పడి సర్కార్‌ పాఠశాలల విద్యార్థులు రాణించడం ప్రభుత్వానికి గర్వకారణమని అభినందించారు. కార్పొరేట్‌ పాఠశాలలతో ప్రభుత్వ విద్యార్థులు పోటీపడటం గౌరవాన్ని మరింత పెంచిందని ఉద్ఘాటించారు. విద్యార్థులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. 90శాతం ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు ప్రభుత్వ పాఠాశాలల్లో చదివినవారేనని గుర్తుచేశారు. తనతో సహా ప్రముఖ రాజకీయ నాయకులంతా ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివినవారేనని అన్నారు. గ్రీన్‌ ఛానెల్‌ ద్వారా నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సెవిూ రెసిడెన్షియల్‌ విధానాన్ని అమలు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని అన్నారు. రెసిడెన్షియల్‌ స్కూల్‌ ద్వారా తల్లిదండ్రులకు పిల్లల సంబంధాలు బలహీనపడుతున్నాయని ఒక స్టడీ రిపోర్ట్‌ వచ్చిందని తెలిపారు. గ్రామాల్లో ఉండే పాఠశాలలపై నిర్లక్ష్యం వహించొద్దని హెచ్చరించారు. విద్య విూద ప్రభుత్వం పెట్టేది ఖర్చు కాదు.. పెట్టుబడి అని అభిప్రాయం వ్యక్తం చేశారు. విద్యపై పెట్టుబడి పెడితే సమాజానికి లాభాన్ని చేకూరుస్తుందన్నారు. త్వరలో విద్య, వ్యవసాయ కమిషన్లను ఏర్పాటు చేసి నిరంతరం సమస్యలను పరిష్కరించే వెసులుబాటు కల్పించబోతున్నామని చెప్పారు. 10/10 వచ్చిన విద్యార్థుల అడ్మిషన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు. ఇంటర్మీడియట్‌లోనూ స్టేట్‌ ర్యాంకులు సాధించి భవిష్యత్‌లో రాణించాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఉందని.. ప్రజా పాలనపై నమ్మకం కలిగించేలా ముందుకెళ్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో చదివి పదోతరగతిలో 10/10 జీపీఎస్‌ సాధించిన విద్యార్థులకు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ప్రతిభాపురస్కారాలు అందజేశారు. రవీంద్రభారతిలో విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వందేమాతరం ఫౌండేషన్‌ను ఆయన అభినందించారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. కొంత కాలంగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమవుతున్నాయి. స్కూళ్లలో టీచర్లు లేరని విద్యార్థులు రావట్లేదు.. విద్యార్థుల్లేరని బడులు మూసివేస్తున్నారు. ఇది కోడి ముందా, గుడ్డు ముందా అన్నట్లుగా తయారైంది. ప్రభుత్వం టీచర్లను పెట్టకపోతే.. విద్యార్థులు రారు.. విద్యార్థులు రావడం లేదనే నెపంతో సింగిల్‌ టీచర్‌ పాఠశాలలన్నింటినీ మూసివేసే పరిస్థితి కొనసాగింది. కొన్ని బడుల్లో విద్యార్థుల కన్నా టీచర్ల సంఖ్యే ఎక్కువగా ఉన్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితులన్నింటినీ దృష్టిలో ఉంచుకొనే తక్షణమే 11వేల పైచీలుకు పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చాం. సింగిల్‌ టీచర్‌ బడుల్ని మూసేయడానికి వీల్లేదని, తండాలు, గూడేల్లో, మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ బడులను నిర్వహించడం ద్వారా పేదలు, దళితులు, గిరిజనులకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో పనిచేస్తున్నాం‘ అన్నారు.వందేమాతరం ఫౌండేషన్‌కు అభినందనలు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్ని ప్రోత్సహించడం అభినందనీయం. ప్రభుత్వ బడుల్లో టాపర్లను నిజానికి ప్రభుత్వమే సన్మానించాలి. మట్టిలో మాణిక్యాలుగా రాణించిన విద్యార్థులు ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నారు. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ.80వేలు ఖర్చుపెడుతోంది. ప్రభుత్వం పెట్టే ఖర్చులో అధికశాతం టీచర్ల వేతనాలకే పోతోంది. ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమం ద్వారా తల్లిదండ్రుల్లో ప్రభుత్వ బడులపై అవగాహన కల్పించాలి. పిల్లలను చేర్పించకపోతే.. పాఠశాల మూతబడుతుందని తల్లిదండ్రులకు చెప్పాలి. ప్రభుత్వ పాఠశాలలో చదివిన నాకు వాటి విలువ బాగా తెలుసు. అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాలకే అప్పగించాం. మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా వారికే ఇచ్చి నిధులు గ్రీన్‌ ఛానెల్‌ ద్వారా విడుదల చేయాలని ఆర్థికశాఖను ఆదేశించాం. రూ.2వేల కోట్లు.. శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ బడులను బాగు చేసేందుకు కేటాయించాం అన్నారు. ‘ప్రతి విద్యార్థికీ అమ్మఒడే తొలి పాఠశాల. రెసిడెన్షియల్‌ స్కూళ్లలో చిన్న చిన్న పిల్లల్ని చేర్పించడం ద్వారా వారిని అమ్మఒడికి దూరం చేస్తున్నారు. దీనివల్ల తల్లిదండ్రులు, పిల్లల మధ్య సంబంధబాంధవ్యాలు బలహీనపడుతున్నాయని ఒక నివేదిక తెలిపింది. ఇదో సామాజిక సమస్యగా మారే ప్రమాదం ఉంది. గతంలో ఒకే సిలబస్‌ను ఏళ్ల తరబడి అమలు చేసేవారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్చలేదు. ఇకపై విద్యా కమిషన్‌ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సిలబస్‌ మారుస్తాం. విలువైన సూచనలు ఎవరు చేసినా తప్పక పాటిస్తాం. ఇప్పుడు 10/10 జీపీఎస్‌ వచ్చిన విద్యార్థులు మళ్లీ ఇంటర్‌లోనూ బాగా రాణించాలి. ప్రతి ఒక్కరూ డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లు, ఐఏఎస్‌, ఐపీఎస్‌లుగా ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరుకుంటున్నా అని సీఎం రేవంత్‌ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి, టీజీఆర్టీసీ ఎండీ సజ్జనార్‌, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, విద్యాశాఖ కమిషనర్‌ దేవసేన, వందేమాతరం ఫౌండేషన్‌ నిర్వాహకులు రవీందర్‌తో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యారు.

విభజన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
` తెలంగాణ, ఆంధ్రా కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్‌ శుభాకాంక్షలు
హైదరాబాద్‌(జనంసాక్షి): కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ నుంచి మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, భూపతిరాజు శ్రీనివాస్‌వర్మకు అభినందనలు తెలియజేశారు. విభజన చట్టం అమలు, కేంద్రం నుంచి తెలుగు రాష్టాల్రకు రావాల్సిన నిధుల విడుదలకు కృషి చేయాలని కోరారు. ప్రాజెక్టుల సాధనకు చర్యలు తీసుకోవాలన్నారు. మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం ప్రమాణం చేశారు. ప్రధాని తర్వాత ప్రమాణం పూర్తిచేసిన 71 మంది కేంద్రమంత్రుల్లో 30 మందికి క్యాబినెట్‌ హోదా దక్కింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి కేంద్ర కేబినెట్‌ బెర్త్‌ దక్కించుకున్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ కుమర్‌, కింజారపు రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు భూపతిరాజు శ్రీనివాసవర్మకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రెండు రాష్టాల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి, రావాల్సిన నిధులపై శక్తివంచన లేకుండా కృషిచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఈమేరకు సీఎం రేవంత్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు. విభజన చట్టంలోని అంశాల అమలు, కేంద్రం నుండి తెలుగు రాష్టాల్రకు రావాల్సిన నిధులు, పథకాలు, ప్రాజెక్టుల సాధనకు కృషి చేయాల్సిందిగా కోరారు. మోదీ 3.0 క్యాబినెట్‌ లో తెలంగాణ నుంచి ఇద్దరు బీజేపీ ఎంపీలు.. ఏపీ నుంచి ఒక బీజేపీ ఎంపీ, పొత్తులో భాగంగా ఇద్దరు టీడీపీ ఎంపీలకు అవకాశం లభించింది. దీంతో కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. కిషన్‌ రెడ్డి, కింజారపు రామ్మోహన్‌ నాయుడు కు కేబినెట్‌ హోదా దక్కగా.. బండి సంజయ్‌ కుమర్‌ కు స్వతంత్ర హోదా, పెమ్మసాని చంద్రశేఖర్‌, భూపతిరాజు శ్రీనివాస వర్మ కు సహాయక మంత్రులుగా అవకాశం లభించింది. కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.