సర్కారు బడులకు సాంకేతిక విద్య

ప్రభుత్వ విద్యకు సాంకేతిక సొబగులు
` ప్రభుత్వ పాఠశాలల్లో అత్యాధునిక సాంకేతిక బోధనకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో పలు ఎన్జీవోలతో విద్యాశాఖ ఒప్పందం
హైదరాబాద్‌(జనంసాక్షి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో ప్రముఖ ఎన్‌జీవో సంస్థలతో రాష్ట్ర విద్యాశాఖ ఎంవోయూలు కుదుర్చుకుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధనా సేవలను ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో ఎంవోయూ కుదుర్చుకున్నట్టు విద్యాశాఖ తెలిపింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ఆరు ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతన ఎడ్‌ టెక్‌ సదుపాయాలను ప్రభుత్వం కల్పించనుంది. ఇందుకు నందన్‌ నీలేకని నేతృత్వంలోని ఏక్‌ స్టెప్‌ ఫౌండేషన్‌, డాక్టర్‌ సునీతా కృష్ణన్‌ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్‌, అలక్‌ పాండే ఆధ్వర్యంలో ఫిజిక్స్‌ వాలా, ఖాన్‌ అకాడమీ, షోయబ్‌దార్‌ నిర్వహిస్తోన్న పైజామ్‌ ఫౌండేషన్‌, సఫీనా హుస్సేన్‌ ఆధ్వర్యంలోనే ఎడ్యుకేట్‌ గర్ల్స్‌ లాంటి పేరొందిన సంస్థలతో విద్యాశాఖ ఎంవోయూ కుదుర్చుకొంది.రాష్ట్రంలో విద్యా నాణ్యతా ప్రమాణాలను మెరుగుపరచాలన్న సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజాప్రభుత్వం అమలు చేస్తోన్న కార్యక్రమాలు, పథకాలకు ఆకర్షితులై రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు వివిధ సంస్థలు ముందుకొస్తున్నాయని ప్రభుత్వం తెలిపింది. నందన్‌ నీలేకని నేతృత్వంలో ఏక్‌ స్టెప్‌ ఫౌండేషన్‌ కృత్రిమ మేధ ఆధారిత ఫ్లాట్‌ఫామ్‌తో 540 పాఠశాలల్లో పనిచేస్తుంది. ఇకపై 33 జిల్లాల పరిధిలో 5వేలకు పైగా ప్రాథమిక పాఠశాలలకు విస్తరించనుంది. మూడో తరగతి నుంచి ఐదో తరగతి వరకు తెలుగు, ఇంగ్లీష్‌ భాషలతో పాటు మ్యాథ్స్‌ బేసిక్స్‌ను ఈ సంస్థ అందిస్తుంది.

తెలంగాణలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను ప్రారంభించండి..
` సీఎం రేవంత్‌ రెడ్డికి కేంద్ర మంత్రి జయంత్‌ చౌదరి సూచన
` ఐటీఐలకు ఉచిత విద్యుత్‌ సరఫరా చేయాలని విజ్ఞప్తి
` స్కిల్‌ యూనివర్సిటీకి మద్దతు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరిన సీఎం
` ఐటీఐల సిలబస్‌ అప్‌గ్రేడ్‌కు కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం ఆదేశం
హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్రంలో వీఎఫ్‌ఎక్స్‌, గేమింగ్‌, ఆడియో విజువల్స్‌ రంగాలకు సంబంధించి సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్‌ చౌదరి సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో ఆయన నివాసంలో కేంద్ర మంత్రి జయంత్‌ చౌదరి ఆదివారం సమావేశమయ్యారు. ఐటీఐ విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి ఈ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. తాము ప్రారంభించిన యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేసి.. దానిని ఐటీఐలను అనుసంధానిస్తామని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి తెలియజేశారు. యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంపై ముఖ్యమంత్రిని కేంద్ర మంత్రి అభినందించారు. జాతీయ నైపుణ్య శిక్షణ కింద యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీకి మద్దతు ఇవ్వాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. ఐటీఐలన్నింటికి ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేయాలని కేంద్ర మంత్రి సీఎంను కోరారు. ఐటీఐల్లో సోలార్‌ విద్యుత్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం వెంటనే అధికారులను ఆదేశించారు. ఆధునిక పరిశ్రమ అవసరాలకు తగినట్లు కాలానుగుణంగా ఐటీఐల్లో సిలబస్‌ను అప్‌గ్రేడ్‌ చేయాలని.. ఇందుకోసం ప్రత్యేక కమిటీ నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. సమావేశంలో ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్‌ రెడ్డి, సీఎంవో పరిశ్రమలు, పెట్టుబడుల విభాగం సీఈవో జయేశ్‌ రంజన్‌, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్దన్‌ రెడ్డి, కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులు పాల్గొన్నారు.