డాటాలో తెలంగాణ టాప్‌

` ఏ రాష్ట్ర్రమూ సరిపోదు
` అంచనాలకు మించి రేవంత్‌ రెడ్డి రాణించారు
` రాహుల్‌ గాంధీ కితాబు
` సమాజాన్ని వేగంగా అభివృద్ధి చేసే శక్తి ఒక్క విద్యకే ఉంది
` హిందీ, ప్రాంతీయ భాషలతో పాటు ఇంగ్లిష్‌ కూడా ముఖ్యమే
` భాజపా నేతలు మాత్రం ఆ భాషను తీసేయాలని అంటున్నారు
` దళిత, ఆదివాసీ పిల్లలు ఇంగ్లిష్‌లో చదవకూడదా అని ప్రశ్న
న్యూఢల్లీి(జనంసాక్షి):తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు అంచనాలకు మించి రాణించారని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. కులగణనపై దిల్లీలోని ఇందిరాభవన్‌లో ఇచ్చిన ప్రజెంటేషన్‌ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. కులగణన నిర్వహణ అంత తేలిక కాదని, అయినా తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ సర్వేను విజయవంతంగా చేపట్టారని ప్రశంసించారు. ‘‘ఆఫీస్‌ రూముల్లో కూర్చుని కులగణన చేస్తే మంచి ఫలితాలు రావు. తెలంగాణ కులగణనలో దాదాపు 56 ప్రశ్నలు అడిగారు. సరైన డేటా ఉంటే ఏదైనా చేయగలం. ఇప్పుడు ఆ రాష్ట్రం చేతిలో సరైన డేటా ఉంది. భారత్‌లో తెలంగాణకు ఉన్న స్థాయిలో డేటా మరే రాష్ట్రంలోనూ లేదు. దేశంలో కులగణన నిర్వహణకు ఇది మార్గదర్శిగా నిలుస్తుంది. అయితే కేంద్రంలోని భాజపా సర్కారు సరైన రీతిలో దీన్ని చేయదు. దేశ అసలైన వాస్తవ చిత్రాన్ని బహిర్గతం చేయడానికి ఆ పార్టీ ఇష్టపడదు. సమాజాన్ని వేగంగా అభివృద్ధి చేసే శక్తి ఒక్క విద్యకే ఉంది. ఇంగ్లిష్‌లో విద్య ఇప్పుడు దేశానికి అత్యవసరం. హిందీ, ప్రాంతీయ భాషలు ముఖ్యం కాదని నేను చెప్పట్లేదు. ఇంగ్లిష్‌తోపాటు అవి కూడా ముఖ్యమే. కానీ, భాజపా నేతలు మాత్రం ఇంగ్లిష్‌ను తీసేయాలని అంటున్నారు. భాజపా నేతలను అడగండి.. వారి పిల్లలు ఏ భాషలో చదువుతున్నారో? దళిత, ఆదివాసీ పిల్లలు ఇంగ్లిష్‌లో ఎందుకు చదవకూడదు?’’అని రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు.