సికింద్రాబాద్ నుంచి తొలి వందేభారత్ స్లీపర్, రూట్ ఇదే!
- సికింద్రాబాద్ నుంచి తొలి వందేభారత్ స్లీపర్ రైలు
- ముంబైకి నడపాలని ప్రతిపాదనల్ని పంపించారు
వందేభారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కేందుకు సిద్ధమవుతున్నాయి.. వచ్చే నెలలో ఈ రైళ్లను ప్రారంభించాలని రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. ప్రధాన నగరాల మధ్య విడతలవారీ ఈ రైళ్లను పట్టాలెక్కించుకున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలి వందేభారత్ స్లీపర్ రైలు సికంద్రాబాద్ నుంచి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. తొలి వందేభారత్ స్లీపర్ రైలును సికింద్రాబాద్ నుంచి ముంబైకు నడిపే ఛాన్స్ ఉందంటున్నారు. సికింద్రాబాద్ నుంచి ముంబైకు వందేభారత్ రైలు సర్వీస్ లేదు.. అందుకే ఈ స్లీపర్ రైలును సికింద్రాబాద్ నుంచి ముంబైకు నడిపే ఆలోచనలో ఉన్నారట.సికింద్రాబాద్-ముంబై మధ్య వందే భారత్ రైలు లేకపోవడంతో.. తొలి స్లీపర్ రైలును ఈ రూట్‌లో నడపాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జీఎంకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదననలను దక్షిణ మధ్య రైల్వేకు, రైల్వే బోర్డుకు పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతేకాదు సికింద్రాబాద్ – పుణెల మధ్య నడుస్తున్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్ స్థానంలో వందేభారత్ రైలును అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. అయితే ఈ స్లీపర్ రైలు ఏ మార్గంలో నడపాలనే అంశంపై రైల్వేశాఖ నుంచి అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు.