బ్రిడ్జి ప్రారంభమైంది ప్రజానీకం మురిసింది
రామకృష్ణాపూర్, (జనంసాక్షి) :క్యాతనపల్లి మున్సిపాలిటీ ప్రజల దశాబ్దాల కళ నేడు నెరవేరింది. క్యాతనపల్లి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రారంభమైన వేల పుర ప్రజానీకం మురిసింది. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశి కృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి లు ముఖ్య అతిథులుగా హాజరై బ్రిడ్జిని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎంపీ వంశి కృష్ణ మాట్లాడారు. ఎన్నికల సమయంలో, ప్రచారంలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు బ్రిడ్జి సమస్య ప్రధాన అంశంగా ఉండేదని, ఎమ్మెల్యే గా వివేక్ గెలిచిన సంవత్సర కాలంలో బ్రిడ్జి పనులు పూర్తి చేస్తామని ఇచ్చిన మాటప్రకారం ప్రజల కోరిక నెరవేర్చామని తెలిపారు. కరోనా సమయంలో నిలిచిన అజ్ని ప్యాసింజర్ రైలును పునరుద్ధరించడం జరిగిందని పేర్కొన్నారు. సింగరేణిలో కాక వెంకటస్వామి మొదలు పెట్టిన పెన్షన్ స్కీంను నేడు పది వేలకు పెంచాలని సంబంధిత మంత్రికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, త్వరలోనే పెన్షన్ పెరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే అఙ్ని రైలును రవీంద్రకఖని రైల్వే స్టేషన్ లో నిలుపుదల చేస్తామని పేర్కొన్నారు. అనంతరం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వేంకస్వామి మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచిన మూడు నెలల్లోనే బ్రిడ్జిని ప్రారంభించాలని దృఢంగా ఉన్నప్పట్టికీ గుత్తేదారుడుకి రావల్సిన నిధులు, భూ నిర్వాసితులకు అందాల్సిన నష్ట పరిహారం పూర్తి స్థాయిలో రాకపోవడంతో కొంత ఆలస్యమైందని, వెంటనే వారికి రావల్సిన నిధులు మంజూరు చేయించి పనులను వేగవంతం చేయడం, బ్రిడ్జిని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రెయినేజీలు, మంచినీటి సౌకర్యార్థం కొరకు స్పెషల్ డెవలప్మెంట్ నిధులు మంజూరు చేపించి, అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామని తెలిపారు. అలాగే విద్యా, వైద్య రంగానికి పెద్ద పీట వేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో రెండు వంద కోట్ల రూపాయలతో నూతన ఒరవడితో విద్యాలయాన్ని నిర్మిస్తామని తెలియజేశారు. అలాగే సన్నబియ్యం, రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్, ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ ఇవ్వడంతో పాటు, రాజీవ్ యువ వికాసం ద్వారా నిరుద్యోగ యువకులకు నాల్గు లక్షల రూపాయల రుణాలను త్వరలోనే మంజూరు చేస్తానని, ప్రతి నిరుద్యోగి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ ప్రారంభోత్సవానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, టిపీసీసీ ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, అధికార ప్రతినిధి శ్రీనివాస్, మాజీ చైర్మన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, నాయకులు గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, యాకూబ్ అలీ, నీలం శ్రీనివాస్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.