మెగా జాబ్‌ మేళా ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ హాల్ లో ఈ నెల 26న జరిగే మెగా జాబ్ మేళా నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను గురువారం సింగరేణి, పోలీస్, ఎలక్ట్రిసిటీ, మున్సిపల్ ఇతర శాఖల అధికారులతో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాబ్ మేళా కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుండి సుమారు పది వేల నుండి పదిహేను వేల మంది నిరుద్యోగ అభ్యర్థులు వచ్చే అవకాశాలు ఉన్నాయని, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు. టాస్క్‌ ప్రతినిధులను సమన్వయం చేసుకుని స్టాల్స్‌, రిజిస్ట్రేషన్‌ సెంటర్స్‌ ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. జాబ్ మేళాకు వచ్చే యువతీ, యువకులు ఇంటర్వ్యూలో పాల్గొనేలా సరిగా గైడ్‌ చేసేలా వాలంటీర్లను నియమించాలని సింగరేణి జీఎం ను కోరారు. దూర ప్రాంతాల నుండి వచ్చే అభ్యర్థులకు రవాణా సదుపాయం, ఎండను దృష్టిలో పెట్టుకొని త్రాగునీరు, మజ్జిగ పాకెట్స్, భోజన వసతి అందుబాటులో ఉండేలా చూసుకో వాలన్నారు. అదేవిధంగా, అన్ని శాఖల జిల్లా అధికారులు సమన్వయం చేసుకుని జాబ్ మేళాను సక్సెస్ చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఏరియా సింగరేణి జిఎం రాజేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బుర్ర కొమురయ్య, ముంజాల రవీందర్, చల్లూరి మధు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు