మున్సిపాలిటీకి ఆదాయ వనరులను పెంచుకోవాలి
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి) : భూపాలపల్లి మున్సిపాలిటీకి వచ్చే అన్ని ఆదాయ వనరులను సక్రమంగా సద్వినియోగం చేసుకుని, పట్టణ అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గురువారం భూపాలపల్లి మున్సిపాలిటీ కౌన్సిల్ హాల్లో మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి, జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మీ అధ్యక్షతన అన్ని శాఖల జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో ఆదాయాన్ని పెంచుకున్నప్పుడే పట్టణ అభివృద్ధికి అవకాశం ఉంటుందని తెలిపారు. పట్టణంలోని 30 వార్డుల ప్రజలను భాగస్వామ్యం చేస్తూ నూరు శాతం పన్ను వసూలకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నారు. భూపాలపల్లి పట్టణాన్ని సుందరంగా, ప్రజల సౌకర్యార్థం అభివృద్ధి చేసుకావాలని అన్నారు. ముఖ్యంగా పట్టణంలో అంబేడ్కర్, ప్రొఫెసర్ జయశంకర్, గణేష్ చౌక్, మంజూరునగర్ సర్కిళ్లను భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని విస్తరించాలని, ఆ పనులను చేపట్టాలని సూచించారు. మునిసిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవాలని కోరారు. వేసవి దృష్ట్యా మునిసిపాలిటీలో త్రాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల్లో పురోగతి లేదని ఎమ్మెల్యే కాంట్రాక్టర్ల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో జాప్యం జరిగితే సహించేదిలేదని, కాంట్రాక్టర్ల పై తగిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అదేవిధంగా, బుద్ధారం నుండి కొడవటంచ, పందిపంపుల నుండి దూదేకులపల్లి, సింగారం నుండి దూదేకులపల్లి బీటీ రోడ్డు నిర్మాణ పనులకు అటవీ అనుమతులు తీసుకుని, ఆ పనులను త్వరితగతిన ప్రారంభించాలని ఫారెస్ట్, ఆర్ అండ్ బీ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.