ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకే..!

మంథని, (జనంసాక్షి) : త‌మ వైఫ‌ల్యాల‌ నుంచి ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకే భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) క‌క్షాపూరిత రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతోందని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు అన్నారు. నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్ల‌ను ఛార్జ్ షీట్ లో చేర్చ‌డాన్ని నిర‌సిస్తూ టీపీసీసీ ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ లోని ఈడీ కార్యాల‌యం ఎదుట గురువారం నిర్వ‌హించిన ధర్నాలో పాల్గొని మాట్లాడారు. 12 ఏళ్ల కింద‌టి కేసును ఇప్పుడు తెర‌పైకి తీసుకురావ‌డం వెనుకున్న ఆంత‌ర్య‌మేంట‌ని ప్ర‌శ్నించారు. దేశంలో ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న ధ‌ర‌ల పెరుగుద‌ల‌, అంతర్జాతీయ స్థాయిలో తగ్గుతున్న రూపాయి విలువ, నిరుద్యోగం త‌దిత‌ర స‌మ‌స్య‌ల‌పై నిల‌దీస్తున్నందుకే కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌ల‌ను బీజేపీ టార్గెట్ చేసింద‌న్నారు. స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలను పణంగా పెట్టిన గాంధీ కుటుంబంపై రాజకీయ దురుద్దేశంతోనే తప్పుడు కేసులు పెట్టారన్నారు. పార్టీ ఆత్మ‌స్థైర్యం దెబ్బ తీసేలా రాజ‌కీయ ప్ర‌తీకార చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతుంద‌న్నారు. కక్షాపూరిత రాజ‌కీయాల‌కు స్వ‌స్తి ప‌లికి ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై దృష్టి సారించాల‌ని హిత‌వు ప‌లికారు. ఎన్ని కేసులు పెట్టినా.. కాంగ్రెస్ పార్టీ ఎల్ల‌ప్పుడూ ప్ర‌జ‌ల ప‌క్షాన పోరాటం చేస్తూనే ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

తాజావార్తలు