అడవుల సంరక్షణకు చర్యలు చేపడతాం

share on facebook

– జిల్లా కోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం
– మే1 నుంచి అన్ని ప్రముఖ దేవాలయాల్లో ఆన్‌లైన్‌ సేవలు
– కేసీఆర్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతా
– మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
హైదరాబాద్‌, ఫిబ్రవరి25(జ‌నంసాక్షి) : అడవుల సంరక్షణకు కఠిన చర్యలు చేపడతామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు.  సోమవారం ఉదయం సచివాలయం డీ బ్లాక్‌లోని తన చాంబర్‌లో మంత్రిగా అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ రెండోసారి తనను మంత్రిగా నియమించడంతో తన భాద్యత మరింత పెరిగిందని, సీఎం కేసీఆర్‌కు తనపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నిరంతరం కష్టపడుతానని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అటవీ చట్టంలో మార్పులు తీసుకువచ్చి అడవుల సంరక్షణకు చర్యలు చేపడతామన్నారు. అటవీ శాఖపై సీఎం ఇప్పటికే రివ్యూ చేశారని.. జంగల్‌ బచావో, జంగల్‌ బడావో పేరుతో ప్రజలల్లో మరింత అవగాహన కల్పిస్తామని చెప్పారు. అడవులను కాపాడటం, పర్యావరణ సమతుల్యతపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దేవాదాయ శాఖగా మంత్రిగా ఉన్నవారు మళ్లీ ఎన్నికల్లో గెలవరు అనే సెంటిమెంట్‌ ను బ్రేక్‌ చేశానని, దేవాదాయ శాఖ మంత్రిగా సీఎం కేసీఆర్‌ రెండోసారి భాద్యతలను అప్పగించడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. ఆలయాల అభివృద్దితో పాటు భక్తులకు మెరుగైన సేవలను అందిచేందుకు మరింత కృషి చేస్తామన్నారు. మే1 నుండి అన్ని ప్రముఖ దేవాలయాల్లో ఆన్‌ లైన్‌ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు దేవాదాయ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారని తెలిపారు. 2కోట్ల పది లక్షలు ప్రతి నెల 3వేల 645 దేవాలయాలకు దూప దీప నైవేద్య పథకం ద్వారా చెల్లిస్తున్నామని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ కృషి వల్ల హైకోర్టు విభజనతో ప్రధాన సమస్య తీరిపోయిందన్నారు. కొత్త జిల్లాలో జిల్లా కోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బాధ్యతలు స్వీకరించిన మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డికి పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.

Other News

Comments are closed.