కన్నడ సీఎంగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం

share on facebook


– నాటకీయ పరిణామాల నడుమ ప్రమాణస్వీకారం చేసిన యెడ్డీ

– కన్నడనాట 23వ ముఖ్యమంత్రి బాధ్యతల స్వీకరణ
– మూడవసారి సీఎం పీఠాన్ని అదిష్టించిన యడ్యూరప్ప
– రైతు రుణమాఫీపై తొలిసంతకం
– ఈసారి మూన్నాళ్ల ముచ్చటేనా?
– బలనిరూపణకు 15రోజులు గడువు ఇచ్చిన గవర్నర్‌
– అసెంబ్లీలో బలం నిరూపించుకుంటాం – యడ్యూరప్ప
బెంగళూరు, మే17(జ‌నం సాక్షి) : కన్నడ నాట బీజేపీ రాజకీయ వ్యూహం ఫలించింది.. ఎట్టకేలకు ఉత్కంఠత, నాటకీయ పరిణామాల నడుమ కర్ణాటక రాష్ట్ర 23వ ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ఉదయం 9 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ వాజూభాయ్‌ వాలా ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇది మూడోసారి కావడం విశేషం. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన బీఎస్‌ యడ్యూరప్ప వెంటనే సంచలన నిర్ణయం తీసుకున్నారు. 56వేల కోట్ల రూపాయల రైతు రుణాలను మాఫీ చేస్తూ ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేశారు. రైతు వ్యతిరేక నిర్ణయాల కారణంగానే సిద్దరామయ్య ప్రభుత్వం ఓడిపోయిందన్న విషయాన్ని గమనించిన యడ్యూరప్ప.. సీఎంగా ప్రమాణ స్వీకారం మొదలు మొదటి నిర్ణయం వరకు రైతు అనుకూల వైఖరిని అనుసరించారు. రైతులకు సంఘీభావంగా ఆకుపచ్చ కండువా కప్పుకొని ప్రమాణం స్వీకారం చేసిన యడ్యూరప్ప.. దైవసాక్షిగా, రైతుసాక్షిగా ప్రమాణం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపొందితే రైతు రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని యడ్యూరప్ప హావిూ ఇచ్చారు.
15రోజులు గడువు..
ఈనెల 15న వెలువడ్డ ఎన్నికల ఫలితాల్లో భాజపా 104 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్‌ పార్టీ 78, జేడీఎస్‌ 38 స్థానాల్లో గెలుపొందాయి. ఏ పార్టీకి మెజార్టీ రానందున కాంగ్రెస్‌, జేడీఎస్‌ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. జేడీఎస్‌ నేత కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టేందుకు కాంగ్రెస్‌ అంగీకారం తెలిపింది. దీంతో తమ కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని వారు గవర్నర్‌కు విన్నవించారు. మరోవైపు అతిపెద్ద పార్టీగా అవతరించిన తమకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని భాజపా గవర్నర్‌ను కోరింది. రెండు రోజులుగా రాజ్‌భవన్‌ కేంద్రంగా సాగిన ఉత్కంఠకు గవర్నర్‌ వాజుభాయ్‌ వాలా నిన్న తెరదించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా భాజపాను ఆహ్వానించారు. శాసనసభలో బల నిరూపణకు 15రోజుల గడువు ఇచ్చారు. దీంతో భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప ఈరోజు ఉదయం 9 గంటలకు కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా..
యడ్యూరప్ప ముచ్చటగా మూడోసారి కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. 2007 నవంబర్‌ 7న తొలిసారిగా ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. తదనంతర పరిణామాలతో వారం రోజులకే గద్దె దిగారు. 2008 మే 30న రెండోసారి పదవిని చేపట్టి 3 సంవత్సరాల 62 రోజులు పదవిలో ఉన్నారు. మండ్య
జిల్లా కృష్ణరాజపేట బూకనకెరులో 1943 ఫిబ్రవరి 27న రైతు కుటుంబంలో జన్మించిన ఆయన రాష్టీయ్ర స్వయంసేవక్‌ సంఘ్‌ కార్యకర్తగా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. రైతునేతగా కూడా పేరుగాంచారు. పీయూసీ వరకు చదువుకున్న ఆయన సాంఘిక సంక్షేమ శాఖలో ఫస్ట్‌ డివిజన్‌ గుమాస్తాగా 1965లో నియమితులయ్యారు. ఆ తర్వాత శివమొగ్గలో ఇనుప సామాన్ల వ్యాపారాన్ని ఆరంభించారు. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న ఆయన 1970లో శికారిపుర సంఘ్‌ పరివార్‌ కార్యదర్శిగా నియమితులయ్యారు. 1975లో శికారిపుర పురపాలిక అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అనంతరం అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు.
రెండురోజుల్లో బలపరీక్ష – యడ్యూరప్ప
రెండుమూడు రోజుల్లో తమ ప్రభుత్వం అసెంబ్లీ బలం నిరూపించుకుంటుందని సీఎంగా బాధ్యతలు స్వీకరించిన యడ్యూరప్ప అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కన్నడ ప్రజల ఆశీస్సులతోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశానని అన్నారు. నాకు మద్దతు తెలిపిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు. కాంగ్రెస్‌, జేడీఎస్‌లు అనైతికంగా అధికారంలోకి రావాలని చూస్తున్నాయని, అధిక స్థానాల్లో తమ అభ్యర్థులు గెలిస్తే కాంగ్రెస్‌, జేడీఎస్‌లు కలిసి మాదే మెజార్టీ అనడం విడ్డూరంగా ఉందన్నారు. బలపరీక్షలో తాము నెగ్గుతామని, బీజేపీ స్వచ్ఛందంగా మద్దతు తెలిపేందుకు కాంగ్రెస్‌, జేడీఎస్‌ నుంచి పలువురు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

Other News

Comments are closed.