నగరంలో కనిపించని పచ్చదనం
కాంక్రీట్ జంగల్‌తో పెరుగుతున్న వేడి
మొక్కల పెంపకానికి గ్రేటర్ యత్నం
హైదరాబాద్,మే11(జనంసాక్షి): వేగంగా నగరీకరణ జరగడంతో ఒకప్పుడు ఉద్యానవనాల నగరంగా వెలుగొందిన భాగ్యనగరి నేడు కాంక్రీటు జంగిల్‌లా మారింది. దీంతో ఎండాకాలంలో వేడి తట్టుకోలేనంతగా వస్తోంది. మొక్కలు పెంచాలన్న ప్రచారం పెద్దగా ఫలితం ఇవ్వడం లేదు. శరవేగంగా నగరం విస్తరిస్తున్నందున భారీ సంఖ్యలో మొక్కలు పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. వర్షాలు మరో రెండు లేదా మూడు నెలల్లో మొదలయ్యే సూచనలు ఉన్నందున.. అందుకు అనుగుణంగా హరితహారం దశను
ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో జీవితంలో ఏదైనా ప్రత్యేక సందర్భం కలకాలం గుర్తుండేలా మొక్కను నాటే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు జీవ వైవిధ్య విభాగం డైరెక్టర్ వి.దామోదర్ తెలిపారు. గతేడాది చేపట్టిన కార్యక్రమం మంచి ఫలితం ఇస్తోంది. ఈ మేరకు ఓ మొక్కను నాటి ఆ మొక్కకు అమర్చే ట్రీగార్డుపై వారు కోరుకున్న పేరు, సందర్భం రాస్తారు. పరిరక్షణకు ప్రత్యేక బృందాలను నియమించి సక్రమంగా నీరు, ఎరువులు అందిస్తారు. ఇది కలకాలం నిలిచి పోయేలా చర్యలు తీసుకుంటారు. పుట్టిన రోజులు, వివాహాది వేడుకలు, ఇతర ఉత్సవాలు తదితర కార్యక్రమాలను ప్రకృతిలో పదిలం చేసుకునేలా జీహెచ్‌ఎంసీ ఇలా కార్యాచరణ రూపొందించింది. సరికొత్త విధానంతో నగరంలో పచ్చదనాన్ని పెంచేందుకు వ్యూహం సిద్ధం చేసింది. అందుకోసం ఏడు ప్రాంతాల్లో అధికారులు స్మృతి వనాలను ఏర్పాటు చేస్తున్నారు. ఔత్సాహికులు మూడేళ్ల నిర్వహణ వ్యయం చెల్లించి జ్ఞాపిక బోర్డుపై రాయాల్సిన వివరాలు జీహెచ్‌ఎంసీకి ఇచ్చి, సూచించిన ప్రాంతంలో మొక్క నాటుతారు. బల్దియానే ఆ మొక్కను పెంచి పోషిస్తుంది. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ పరిధిలో పచ్చదనం అంతంత మాత్రంగా ఉండడంతో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దీంతో పచ్చదనం పెంచేందుకు ఈ చర్యను చేపట్టారు. గరంలో ప్రతి గ్రేటర్ మండలంలో కనీసం ఒక పార్కు ఉండేలా మొత్తం ఏడు స్మృతి వనాలను బల్దియా నిర్మిస్తోంది. ప్రస్తుతం తూర్పు మండలం, హయత్‌నగర్ సర్కిల్‌లోని సెల్ఫ్ ్గ/నాన్స్‌డ్ కాలనీలోని పార్కులో స్మృతి వనం ఏర్పాటుకు నిర్ణయించారు. మిగిలిన ఆరు ప్రాంతాల గుర్తింపునకు కసరత్తు సాగుతోంది. ఈ మేరకు ఒక్కో మొక్కకు 3నుంచి 5 వేల వరకు వసూలు చేస్తారు. ఇవి కాకుండా శ్మశానాలు, చెరువులు, రహదారుల పక్కన, వంతెనల కింద మరో 627 పార్కులున్నాయి. బల్దియా ప్రస్తుతం నిర్వహిస్తున్న పార్కులకు అదనంగా మరో 100 ఉద్యాన వనాల ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఇందుకు ఖాళీ స్థలాలను గుర్తించారు. వాటిలో 20 పార్కులను అభివృద్ధి చేసేందుకు లయన్స్ క్లబ్ అంగీకరించిందన్నారు. మిగిలిన వాటికోసం యూబీడీ విభాగం సుమారు రూ.10 కోట్ల వ్యయం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఖాళీ స్థలాల్లో మొక్కలు పెంచడం, పచ్చని బయళ్లను అభివృద్ధి చేస్తే చుట్టు పక్కల ప్రాంతాల్లో కాలుష్యం, వేడి తగ్గే అవకాశముందన్నారు.హరితహారంలో గ్రేటర్ పరిధిలో కోటి మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు కమిషనర్ తెలిపారు.