వేగంగా వ్యాప్తి చెందినా.. ఒమిక్రాన్‌లో మరణాలు తక్కువే..` డబ్ల్యూహెచ్‌వో

share on facebook

 

జెనీవా,డిసెంబరు 1(జనంసాక్షి):దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఇప్పటికే 14 దేశాలకు విస్తరించినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో ప్రపంచదేశాలు అప్రమత్తమయ్యాయి. వైరస్‌ కట్టడిలో భాగంగా పలు దేశాలు దక్షిణాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణాలపై ఆంక్షలు విధించగా.. మరికొన్ని దేశాలు కొవిడ్‌ కట్టడి చర్యలను ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్‌పై అతిగా స్పందించొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనామ్‌ ప్రపంచ దేశాలకు సూచించారు. కఠిన ఆంక్షలు అవసరం లేదన్నారు. ‘తమ ప్రజలను కాపాడుకోవాలని దేశాలు భావించడాన్ని మేము అర్థం చేసుకున్నాం. కానీ, ఒమిక్రాన్‌ వేరియంట్‌పై మాకింకా పూర్తి అవగాహన రాలేదు. వేరియంట్‌ తీవ్రత ఎంత? ప్రస్తుత కొవిడ్‌ వ్యాక్సిన్లు ఒమిక్రాన్‌ను సమర్థంగా ఎదుర్కోగలవా? అనే ప్రశ్నలకు సమాధానం అన్వేషించాల్సి ఉంది. ఒమిక్రాన్‌ వ్యాప్తి వేగంగా ఉన్నా ఇప్పటి వరకు మరణాలు నమోదు కాలేదు. అయినా, అప్పుడే కొన్ని దేశాలు వైరస్‌ కట్టడికి అనవసరంగా కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. వీటి వల్ల వైరస్‌ను నియంత్రించలేము. పైగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. పరిస్థితులు మరింత దిగజారుతాయి’’అని టెడ్రోస్‌ అన్నారు. దక్షిణాఫ్రికాను శిక్షించొద్దు..ఒమిక్రాన్‌ గురించి పూర్తిగా తెలియక ముందే దక్షిణాఫ్రికాపై ఆంక్షలు విధించవద్దని టెడ్రోస్‌ ప్రపంచదేశాలకు విజ్ఞప్తి చేశారు. ఒమిక్రాన్‌పై ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్న దక్షిణాఫ్రికా, బోట్సావానా దేశాలకు టెడ్రోస్‌ కృతజ్ఞతలు తెలిపారు. సరైన పని చేస్తున్నందుకు ఆ దేశాలను ఇతర దేశాలు శిక్షిస్తుండటం ఆందోళనకరమన్నారు.

Other News

Comments are closed.