-->

అమ్మా.. మీ కొడుక్కు చెప్పు!

– మోదీ తల్లికి రైతుల లేఖ

న్యూఢిల్లీ,జనవరి 24(జనంసాక్షి): వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు పెద్దఎత్తున ఆందోళన చేస్తుండగా.. మరోవైపు ఓ రైతు మాత్రం చట్టాల రద్దు కోరుతూ ప్రధాని మోదీ తల్లికి లేఖ రాశారు. ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలని తన కుమారుడికి చెప్పాలని కోరారు. ఈ మేరకు మోదీ తల్లి హీరాబెన్‌కు పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ జిల్లాకు చెందిన హర్‌ప్రీత్‌ సింగ్‌ అనే రైతు లేఖ రాశారు.”అమ్మా.. బరువెక్కిన హృదయంతో ఈ లేఖ రాస్తున్నా. ఈ దేశానికి, ప్రపంచానికి అన్నం పెడుతున్న రైతన్నలు సాగు చట్టాల రద్దు కోరుతూ దిల్లీ రోడ్లపై ఆందోళన చేస్తున్నారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. కొందరు అనారోగ్యం పాలవగా.. మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. తోటి రైతులు ప్రాణాలు కోల్పోవడం బాధిస్తోంది. విూ కుమారుడైన ప్రధాని నరేంద్రమోదీకి ఆ రైతు చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పండి. ఎవరు చెప్పినా వినకపోవచ్చు గానీ, విూరు చెప్తే తప్పక వింటారన్న నమ్మకం నాకుంది. ఆ నమ్మకంతో ఎంతో ఆశగా ఈ లేఖ రాస్తున్నా” అని హర్‌ప్రీత్‌సింగ్‌ పేర్కొన్నారు.