ఆయుష్మాన్ భారత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి -బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర రావు
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర రావు అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని 43వ వార్డు నెహ్రూ నగర్ లో బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షులు మీర్ అక్బర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ భారత్ ఆన్ లైన్ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పేదల సంక్షేమం, అభివృద్ధి కొరకు అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు.పీఎం నరేంద్ర మోడీ ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ప్రతి వ్యక్తికి సంవత్సరానికి రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య భీమా సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు.పీఎం మోడీ ఈ పథకాన్ని 2018లో ప్రారంభించినప్పటికీ సీఎం కేసీఆర్ తెలంగాణలో పథకాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించారని అన్నారు.1350 రకాల వైద్య చికిత్సలను ప్రైవేట్ , ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా చేయించుకునే అవకాశం ఉందని తెలిపారు.రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో అర్హులైన నిరుపేదలు సంక్షేమ పథకాలను అందుకోలేకపోతున్నారని విమర్శించారు.రాష్ట్రంలో బస్, విద్యుత్, రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచి పేదలపై భారం మోపారని అన్నారు. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తామన్న సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలులో విఫలమైందన్నారు.గతంలో రూ.5 లక్షలు ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు రూ. 3 లక్షలే ఇస్తామని చెబుతూ, అనేక నిబంధనలను పెట్టి పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు.పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు.ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, సుకన్యా యోజన,ఈ శ్రమ్ కార్డ్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ కర్నాటి కిషన్,పట్టణ అధ్యక్షులు ఎండీ అబిద్, బిజెపి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పల్సా మహాలక్ష్మి , నాయకులు చలమల్ల నరసింహ, మన్మధ రెడ్డి, సలిగంటి వీరేంద్ర ,బూర మల్సూర్ గౌడ్, పల్సా మల్సూర్ గౌడ్ ,ఫణి నాయుడు,సంధ్యాల సైదులు తదితరులు పాల్గొన్నారు.
Related