ఆరు విమాశ్రయాలు ఇవ్వండి
– కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్‌పురిని కోరిన సీఎం కేసీఆర్ )
న్యూఢిల్లీ,డిసెంబరు 12 (జనంసాక్షి): తెలంగాణలో ఆరు డొమెస్టిక్ ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్‌పురిని సీఎం కేసీఆర్ కోరారు. శనివారం మధ్యాహ్నం కేంద్ర మంత్రిని సీఎం కేసీఆర్ కలిసి రాష్ట్రంలో కొత్త ఎయిర్‌పోర్టుల అంశంపై చర్చించి ఓ లేఖను అందజేశారు.పెద్దపల్లి జిల్లాలోని బసంత్‌నగర్, వరంగల్ అర్బన్ జిల్లాలోని మామునూర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్‌పల్లి, మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ కోరారు. రాష్ట్రంలో కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు సంబంధించి ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌తో సంప్రదింపులు జరిపినట్లు సీఎం కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. విమానాశ్రయాల ఏర్పాటుకు సంబంధించి 2018లో ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు నివేదిక కూడా పంపించడం జరిగిందని కేసీఆర్ తెలిపారు. చిన్న విమానాల కోసం ఫ్రిల్స్ విమానాశ్రయాలు మాత్రమే అభివృద్ధి చేయబడుతాయని నివేదిక సూచించిందన్న విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. మొత్తం 6 చోట్ల దేశీయ విమానాశ్రయాల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన అబ్ స్టాకిల్ లిమిటేషన్ సర్ఫేస్ సర్వే, సాయిల్ టెస్ట్, ఇతర పరిశీలన డ్రాఫ్ట్ రిపోర్టు తాజాగా వచ్చిందని కేసీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. నూతన ఎయిర్‌పోర్టుల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖను సీఎం కేసీఆర్ కోరారు. ఎయిర్‌పోర్టు సైట్‌లను ఖరారు చేయడంలో సింగిల్ విండో ప్రతిపాదికన అన్ని చట్టబద్దమైన అనుమతులు ఇవ్వాలని కోరారు. నాన్ – షెడ్యూల్డ్ ఆపరేటర్స్ పర్మిట్ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సొంత నిధులతో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేసీఆర్ లేఖలో స్పష్టం చేశారు.