ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరించాలి
వరంగల్,నవంబర్11(జనం సాక్షి): కాకతీయ విశ్వవిద్యాలయం దూర విద్య కేంద్రంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారి సర్వీసులు క్రమబద్దీకరించాలని తాత్కాలిక ఉద్యోగులు డిమాండ్ చేశారు. 25 ఏళ్లపాటు దినసరి వేతనాలపైన్నే విధులు నిర్వహించడంపై ఉద్యోగులు ఆవేదనతో ఉన్నారని అన్నారు. ఇప్పటికే కొందరు ఉద్యోగులు సర్వీస్లు రెగ్యులర్ కాకముందే ఉద్యోగ విరమణ పొందారని చెప్పారు. ఉద్యోగులకు ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు లభించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని వేతనాలపైన విధులు నిర్వహిస్తున్న దినసరి వేతన ఉద్యోగులు సంఘటితంగా పోరాడాలని కేయూ దూరవిద్య కేంద్రం దినసరి వేతన ఉద్యోగ సంఘం నేతలు అన్నారు. తమ సర్వీస్ల క్రమబద్దీకరణకు ఉద్యమించాలని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి విశ్వవిద్యాలయం అధికారులు చొరవ చూపాలని అన్నారు. దూరవిద్య కేంద్రంలో పని చేసే వారి సర్వీస్లను క్రమబద్ధీకరిస్తే విశ్వవిద్యాలయానికి ఆర్థిక భారం ఉండదని చెప్పారు. దూరవిద్యకేంద్రం సెల్ఫ్ ఫైనాన్స్ ద్వారా నిర్వహిస్తామని తెలిపారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను కేయూ అధికారుల, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి సంఘం కృషి చేస్తుందని పేర్కొన్నారు. చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల సర్వీస్లను క్రమబద్దీకరించాలని కోరారు.