ఎపిలో ప్రశాంతంగా బంద్‌

share on facebook

వర్షంలోనూ ఆగని నిరసనలు
వామపక్షాల నిరసన ప్రదర్శనలు
డిపోలకే పరిమితమైన బస్సులు
విజయవాడ,సెప్టెంబర్‌27(జనంసాక్షి) కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన నల్ల చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు చేపట్టిన భారత్‌ బంద్‌ను కొనసాగుతోంది. భారత్‌ బంద్‌కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఏపీలోని విజయవాడ బస్టాండ్‌ ఎదుట వామపక్ష, కాంగ్రెస్‌ పార్టీల ఆందోళన చేపట్టాయి. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వాహానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వామపక్ష పార్టీల బంద్‌కు వ్యాపార వాణిజ్య, విద్యా సంస్థలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. వర్షం సైతం లెక్క చేయకుండా విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద రైతులకు మద్దతుగా వామపక్ష, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు ఆందోళన చేస్తున్నారు. విజయవాడలో భారత్‌ బంద్‌ విజయవంతంగా కొనసాగుతోంది. జోరువానను కూడా లక్ష్యపెట్టకుండా నిరసనలు హోరెత్తాయి. బంద్‌కు మద్దతు తెలుపుతూ… దుకాణాలు మూతపడ్డాయి. పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు.
సోమవారం ఉదయాన్నే సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌ల ఆధ్వర్యంలో నిరసనకారులు విజయవాడ బస్టాండ్‌కు చేరుకొని బస్సులను నిలిపివేశారు. విజయవాడ బస్టాండ్‌ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. అక్కడి నుండి ప్రదర్శనగా బయలుదేరి లెనిన్‌ సెంటర్‌కు చేరుకున్నారు. వర్షం మొదలయి నప్పటికీ జోరువానలోనే నిరసనను వ్యక్తపరిచారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వరంగ కార్యాలయాలు మూతపడ్డాయి. వర్తక వాణిజ్య రంగాలకు చెందినవారు, జర్నలిస్టు సంఘాలు నిరసన వ్యక్తపరిచాయి. రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని నేతలు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణను నిలిపేయాలని కోరారు. రైల్వే కాంట్రాక్టు కార్మికులు డివిజన్‌ కేంద్రాల్లో ధర్నాలు చేపట్టారు. ఈ బంద్‌లో దేశవ్యాప్తంగా 540 సంఘాలు, 19 రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి. బంద్‌లో భాగంగా… అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం లోని కొత్తపల్లి క్రాస్‌ వద్ద కియా బస్సులను వామపక్ష నేతలు అడ్డుకున్నారు. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో… సిపిఎం, సిఐటియు నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కనిశెట్టిపల్లి వినోద్‌ కుమార్‌, ఎం.పెద్దన్న, సిపిఎం నాయకులు ఊటుకూరు నాగరాజ్‌, చాంద్‌ బాషా, కిరణ్‌ కుమార్‌, రామచంద్రలను అరెస్టు చేసి సోమందేపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతమైన వాతావరణంలో బంద్‌ కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. టీడీపీ, వామపక్ష, ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో బంద్‌ జరుగుతోంది. ఆందోళనకారులు రోడ్లపై ఎక్కడికక్కడ వాహనాలను నిలిపేసి బంద్‌ పాటిస్తున్నారు. ఆర్టీసీ, ప్రవేట్‌ బస్సులతో సహా రవాణాలు పూర్తిస్థాయిలో ఆగిపోయిన పరిస్థితి నెలకొంది.

Other News

Comments are closed.