ఎరువుల కోసం రైతు అగచాట్లు

ఆదిలాబాద్‌, జూలై 23 : జిల్లాలో గత మూడురోజులుగా విస్తరంగా వర్షాలు కురుస్తున్న రైతులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. మొన్నటి వరకు వర్షాలు లేక ఆందోళనలో ఉన్న రైతులకు వర్షాలు కురుస్తున్న వారికి కావాల్సిన ఎరువులు మాత్రం దొరకడం లేదు. ఎరువులకు ఎలాంటి కొరత లేదని రైతులకు కావాల్సిన ఎరువులను అందుబాటులో ఉంచామని ప్రకటించిన వ్యవసాయ శాఖ అధికారులు రైతులు మాత్రం ఎరువుల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. బైంసా, ముధోల్‌, కుబీర్‌ తదితర ప్రాంతాలలో ఎరువుల కోసం బారు తీరి ఎదురు చూడాల్సి వస్తోంది. సకాలంలో ఎరువులు దొరకక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల కోసం రైతు కుటుంబాలు ఉదయం 6 గంటలకే తరలి వచ్చి దుకాణాలు, సహకార సంఘాల ముందు పడిగాల్పులు పడుతున్నారు. ఎరువుల కోసం రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఇదిలా ఉండగా ముధోల్‌ నియోజకవర్గ రైతులకు సరిపడే యూరియాను తెప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే వేణుగోపాలచారి విజ్ఞప్తి చేశారు. మరో రెండు రోజుల్లో రైతులకు కావాల్సిన ఎరువులను తెప్పించి రైతులకు పంపిణీ చేస్తామని అన్నారు.