ఒడిషా అసెంబ్లీ ఎదుట ఉద్రిక్తత

– నిరసన తెలిపిన ప్రతిపక్ష కాంగ్రెస్‌- అడ్డుకున్న పోలీసులు.. లాఠీచార్జి
– 14 మంది కార్యకర్తలకు గాయాలు
భువనేశ్వర్‌, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి) :
ఒడిషా అసెంబ్లీ ఎదుట గురువారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రతిపక్ష కాంగ్రెస్‌ నాయకులు తెలిపిన నిరసన రభసగా మారడంతో ఈ పరిస్థితి తలెత్తింది. వివరాలు ఇలా ఉన్నాయి. సీఎం నవీన్‌ పట్నాయక్‌ తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ గురువారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. భారీ ర్యాలీగా కాంగ్రెస్‌ కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. బారికేడ్లు దాటుకుని అసెంబ్లీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. కార్యకర్తలను పోలీసులు నిలువరించడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఆందోళనకారులు ఆగ్రహానికి గురై పోలీసులపై కర్రలతో దాడికి దిగారు. దీంతో పోలీసులు కూడా తమ లాఠీలకు పని చెప్పారు. దీంతో ఆ ప్రాంతం పోలీసులు, ఆందోళనకారుల దాడులు, ప్రతిదాడులతో రణరంగాన్ని తలపించింది. ఈ దాడుల్లో పోలీసులతోపాటు 14 మంది ఆందోళనకారులు గాయాలపాలయ్యారు.