కర్నాటకంలో క్షణక్షణానికో మలుపు!

సహచరులకు మంత్రి పదవులు ఇవ్వాలి
మెలిక పెట్టిన సదానందగౌడ
బెంగళూరు, జూలై 10 : కర్నాటకంలో క్షణ క్షణానికో మలుపు.. నాయకత్వ మార్పు సజావుగా సాగుతుందనుకున్న బిజెపి అధిష్టానానికి ముఖ్యమంత్రి సదానందగౌడ చివరి క్షణంలో ఝలక్‌ ఇచ్చారు. సదానంద స్థానంలో జగదీష్‌ షెట్టర్‌ను నియమించాలని బిజెపి కోర్‌ కమిటీ ఆదివారంనాడు నిర్ణయించింది. సదానందగౌడ కూడా రాజీనామా చేసేందుకు అంగీకరించారు. సదానందగౌడ నుంచి నాయకత్వ పగ్గాలు జగదీష్‌ షెట్టర్‌ చేపట్టేందుకు వీలుగా బిజెపి లెజిస్లేచర్‌ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పరిశీలకులుగా సీనియర్‌ నేతలు అరుణ్‌జైట్లీ, రాజ్‌నాధ్‌సింగ్‌ హాజరయ్యారు. మంత్రివర్గం కూర్పుపై సలహాలు, సూచనలు ఇచ్చేందుకు అధిష్టానం వీరిని పంపింది. ఎమ్మెల్యేలంతా రాజ్‌భవన్‌ సమీపంలోని కెపిటోల్‌ హోటల్‌లో సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశానికి సదానంద గౌడ వర్గానికి చెందిన 50 మంది ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. సదానంద నివాసంలో వీరంతా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాజీనామా చేసేందుకు సదానంద చివరి క్షణంలో మూడు డిమాండు అంగీకరించాలంటూ మెలిక పెట్టారు. 1. తన అనుయాయి అయిన గోవింద్‌ ఖర్జోల్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని, యడ్యూరప్ప వర్గంతో పాటు తన వర్గ ఎమ్మెల్యేలకు కూడా సమానంగా కీలకమైన మంత్రి పదవులు ఇవ్వడం.. తనకు రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు అప్పజెప్పాలని మూడు డిమాండ్లను అధిష్టానం ముందు ఉంచారు. దీంతో ఖంగుతిన్న పరిశీలకులు రాజ్‌నాధ్‌సింగ్‌, అరుణ్‌జైట్లీ ఎప్పటికప్పుడు సమాచారాన్ని గడ్కారికి వివరించారు. మరోవైపు రవాణా, హోం మంత్రిగా ఉన్న అశోక్‌ కూడా ఉప ముఖ్యమంత్రి పదవి కోసం తెర వెనుక గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన లెజిస్లేచర్‌ పార్టీ సమావేశం ఈ పరిణామాలతో రద్దయింది. ఉప ముఖ్యమంత్రి పదవిని సృష్టించేందుకు అధిష్టానం సుముఖంగా లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. యడ్యూరప్ప ఒత్తిడికి తలొగ్గి అధిష్టానం ముఖ్యమంత్రి సదానందగౌడను మార్చి ఆయన స్థానంలో యడ్డి వర్గానికి చెందిన జగదీష్‌ షెట్టర్‌ను నియమించాలని నిర్ణయించింది. పలు ఆరోపణలతో యడ్యూరప్ప ముఖ్యమంత్రి పీఠం నుంచి వైదొలగిన సమయంలో సదానందగౌడ ఆయన స్థానంలో ప్రభుత్వ పగ్గాలు చేపట్టారు. దాదాపు 11 నెలల కాలంలో ఆయన తనదైన శైలిలో ప్రభుత్వాన్ని నడిపిస్తూ విజయాలు సాధించారు. అయినప్పటికీ యడ్యూరప్ప గౌడను పదవి నుంచి దించాలని అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. సదానందగౌడను అధిష్టానం బుజ్జగించడంతో కోర్‌ కమిటీ నిర్ణయం మేరకు ఆదివారంనాడు ఆయన పదవికి రాజీనామా చేసేందుకు అంగీకరించారు. అయితే కొత్త ముఖ్యమంత్రిని లాంఛనంగా ఎంచుకునే సమావేశానికి కొన్ని గంటల ముందు ఆయన ఎదురుతిరిగి కొత్త డిమాండ్లను తెరపైకి తెచ్చారు. దీంతో కర్నాటకంలో రాజకీయ సంక్షోభం ఇంకా కొనసాగుతునే ఉంది.