కోర్టులో …బస్సులో అన్ని చోట్లా అఘాయిత్యాలు

ఆగ్రా,డిచ్‌పల్లి: ఆగ్రాలో పర్యటిస్తున్న బ్రిటన్‌కు చెందిన ఓ యువతి(25)పై ఒక వ్యక్తి అత్యాచార యత్నం చేశాడు. మసాజ్‌ చేసేందుకు హోటల్‌ గదిలోకి వచ్చిన ఆ వ్యక్తి ఆమెపై అత్యాచార యత్నం చేయడంతో తప్పించుకునే క్రమంలో ఆ యువతి రెండో అంతస్తు నుంచి దూకేంసింది. దీంతో ఆమెకు ఒక కాలు విరిగిపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు హోటల్‌ యజమాని సచిన్‌ చౌహాన్‌ను అరెస్టు చేశారు. మరోవైపు ..భర్తతో విడాకుల వివాదాన్ని పరిష్కరించుకునేందుకు వెళ్లిన మహిళపై.. ఆమె భర్త, అతని బావ, న్యాయవాది, లాయర్‌ సహాయకుడు కలిసి కోర్టు ఆవరణలోనే లాయర్‌ గదిలో అత్యాచారం చేశారు.
పాటియాలా కోర్టు కాంప్లెక్స్‌లో జరిగిందే దారుణం. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక మన రాష్ట్రంలో … హైదరాబాద్‌ నుంచి షిర్డీకి బస్సులో వెళ్తున్న నార్వే యువతి (23)పై కొందరు యువకులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. సోమవారం అర్థరాత్రి బస్సు డిచ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఇందల్వాయి శివార్లకు చేరుకున్న తర్వాత.. పీరాజి విజయ్‌, ఉప్పల్‌ చందర్‌, రంజిత్‌కుమార్‌, రాయదుర్గం సాయికిరణ్‌,పున్నింటి సుదర్శన్‌లు మద్యం మత్తులో బస్సును అక్కడే నిలిపివేసి మరీ ఆమెను వేధించారు.
కొద్దిసేపటి తర్వాత బస్సును డ్రైవర్‌ డిచ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అదే బస్సులో ఉన్న ఓ ఉపాధ్యాయురాలి సయంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రక్షణ కల్పించండి:సీఎంలకు చిరంజీవి విజ్ఞప్తి న్యూఢిల్లీ, మార్చి 19 : బ్రిటిష్‌ పర్యాటకులిపై ఆగ్రాలో అత్యాచార యత్నం జరగడంపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. దీనిపై ఆయన హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో మాట్లాడారు. అలాగే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి విదేశీ పర్యాటకులకు తగిన భద్రత కల్పించాలని కోరారు.