చిన్నారుల వ్యాక్సిన్‌పై తొందరపడం


` ఆచితూచి నిర్ణయం తీసుకుంటాం
` కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ
దిల్లీ,నవంబరు 12(జనంసాక్షి):చిన్నారులకు కరోనా టీకా అందించే విషయంలో తాము తొందరపడకూడదని నిర్ణయించుకొన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ అన్నారు. ఈ విషయంలో నిపుణుల సూచన మేరకు ముందుకు వెళ్లనున్నట్లు చెప్పారు. ఓ విూడియా సంస్థ నిర్వహించిన సదస్సులో కరోనా టీకాకు సంబంధించి పలు విషయాలు వెల్లడిరచారు. ‘చిన్నారులకు టీకా అందించే విషయంలో మేం తొందరపడదల్చుకోలేదు. అది పిల్లలకు సంబంధించిన విషయం. వారికి టీకాలు వేసే ముందు అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. నిపుణుల సూచనతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే వారు దేశ భవిష్యత్తు. వారి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి’ అని మాండవీయ తెలిపారు. ఇప్పటికే స్వదేశీ టీకా అయిన జైకోవ్‌`డి డీసీజీఐ అనుమతి పొందిన సంగతి తెలిసిందే. ఇది దేశంలో 12 ఏళ్లు పైబడిన వారికి అందుబాటులోకి వచ్చిన తొలి టీకా. అయితే, దీని పంపిణీపై మాత్రం కేంద్రం ప్రకటన చేయాల్సి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో చిన్నారులకు టీకా వేస్తున్నప్పటికీ.. భారీ స్థాయిలో మాత్రం ఎక్కడా జరగడం లేదని మంత్రి అన్నారు. అలాగే బూస్టర్‌ డోసు గురించి మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం దేశంలో తగినన్ని టీకా డోసులు అందుబాటులో ఉన్నాయి. అయితే, ముందు అర్హులందరికీ రెండు డోసులు అందివ్వడమే మా ముందున్న ప్రధాన లక్ష్యం. ఆ తర్వాత నిపుణుల సూచన మేరకు నిర్ణయం తీసుకుంటాం’ అని అన్నారు. అంతేకాకుండా భారత్‌ నిర్వహిస్తోన్న టీకా కార్యక్రమంపై మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. అధిక జనాభా, భిన్నమైన సవాళ్లు ఉన్న ఈ దేశంలో దాదాపు 80 శాతం మంది అర్హులు తొలి డోసు తీసుకున్నారన్నారు. టీకా తీసుకున్నా.. జాగ్రత్తలు తీసుకోకపోతే కొవిడ్‌ సోకే అవకాశం ఉన్నట్లు తెలిసిందన్నారు. అయితే, టీకాలు మహమ్మారి తీవ్రతను తగ్గిస్తాయని మరోసారి గుర్తుచేశారు. మొదటి డోసు తీసుకున్నవారికి 96 శాతం, రెండో డోసు తీసుకున్నవారికి 98.5 శాతం రక్షణ కల్పిస్తాయని వెల్లడిరచారు. డిసెంబర్‌ 31 నాటికి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా వేయాలనుకుంటున్నామని, అది ప్రజలు అందించే మద్దతుపై ఆధారపడి ఉంటుదన్నారు.