జర్మనీ గజగజ
` కోవిడ్ రోగులతో నిండిపోయిన ఆస్పత్రులు
` నిలిచిన సర్జరీలు
బెర్లిన్,నవంబరు 10(జనంసాక్షి):జర్మనీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. బుధవారం రికార్డు స్థాయిలో 39,676 కొత్త కేసులు నమోదైనట్లు ఆ దేశ వ్యాధి నియంత్రణ కేంద్రం వెల్లడిరచింది. శుక్రవారం 37,120 మంది వైరస్ బారిన పడగా.. బుధవారం ఆ సంఖ్యను మించి కేసులు నమోదయ్యాయి. వారంరోజులుగా అక్కడ ఇన్ఫెక్షన్ రేటు ప్రతి లక్ష మందికి.. 232.1కి చేరింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయకుంటే జర్మనీలో మరోసారి లాక్‌డౌన్ తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో అత్యవసర పరిస్థితి నెలకొందని అంటున్నారు.జర్మనీలో ఆసుపత్రులు, ఐసీయూల్లోకి చేరే కొవిడ్ రోగుల సంఖ్య అధికంగా ఉంది. వైరస్ బాధితులతో ఐసీయూలు నిండిపోయాయని, కొత్త రోగులను చేర్చుకునే పరిస్థితులు లేవని ఆసుపత్రులు పేర్కొంటున్నాయి. సిబ్బంది మొత్తం కొవిడ్ బాధితులనే పర్యవేక్షిస్తుండటంతో పలు సర్జరీలను నిలిపివేయాల్సి వచ్చిందని బెర్లిన్‌లోని ఓ చారిటీ ఆసుపత్రి తెలిపింది. ఈ నేపథ్యంలోనే వైద్యాధికారులు, నిపుణులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొంటున్నారు. వైరస్ ఉద్ధృతిని కట్టడిచేసేందుకు కఠిన నిర్ణయాలు అవసరమని పేర్కొంటున్నారు.
టీకా తీసుకోనివారే అధికంగా..
లాక్‌డౌన్ విధించే అవకాశం లేదని పదేపదే ప్రకటిస్తున్న అధికారులు అందరూ టీకాలు వేసుకోవాలని కోరుతున్నారు. టీకా వేసుకోనివారిలోనే ఎక్కువగా కరోనా కేసులు వెలుగుచూస్తున్నట్లు అధికారులు తెలిపారు. జర్మనీ జనాభా 8.30 కోట్లు కాగా.. వీరిలో 67 శాతం మంది పూర్తిస్థాయిలో టీకాలు వేసుకున్నారు. ఇప్పటివరకు ఆ దేశంలో కరోనా కారణంగా 96,963 మంది ప్రాణాలు కోల్పోయారు.